జగన్ పై దాడి స్టార్టయిందిగా.....!

Update: 2018-10-04 09:30 GMT

వైసీపీ అధినేత జగన్ ను దెబ్బకొట్టేందుకు మరోసారి చంద్రబాబు అనుకూల మీడియా ప్రయత్నాలు ప్రారంభించింది. జగన్ పై ఎప్పుడూ విషంగక్కే ఆ పత్రిక నిరాధార ఆరోపణలతో నిజాలను పక్కన పెట్టి అసత్యాలను ప్రచారం చేయడం ప్రారంభించింది. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ ఇదే రీతిలో నిప్పుల గక్కింది. తాజాగా బీజేపీ, జగన్ కు లింకు పెడుతూ వచ్చిన కథనం విస్మయపర్చేలా ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి నియోజకవర్గ ఇన్ ఛార్జి లేళ్ల అప్పిరెడ్డిని తప్పించడం కన్నా గెలుపుకోసమేనట. అక్కడ బలహీనమైన అభ్యర్థిని నిలిపి కన్నా విజయానికి జగన్ పరోక్షంగా దోహదపడతున్నారట. ఇదే కాదు పది శాసనసభ, మూడు, నాలుగు లోక్ సభ స్థానాల్లో కూడా బలహీన అభ్యర్థులను బరిలోకి దించి బీజేపీతో పరోక్షంగా జగన్ పొత్తు పెట్టుకుంటారన్నది ఈ కథనం సారాంశం.

కన్నా కోసమేనట......

నిజానికి లేళ్ల అప్పిరెడ్డిని తప్పించడానికి వెనక అనేక కారణాలున్నాయి. బలహీనవర్గానికి చెందిన ఏసురత్నం మాజీ పోలీసు అధికారి మాత్రమే కాకుండా నియోజకవర్గానికి కొత్త వ్యక్తి. లేళ్ల అప్పిరెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై దాదాపు 18 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పార్టీకోసం కష్టపడి పనిచేస్తున్నా అక్కడ బీసీ, ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉండటం, జనసేన రంగంలోకి దిగుతుండటంతో జగన్ తప్పని సరి పరిస్థితుల్లో వ్యూహం మార్చాల్సి వచ్చిందన్నది పార్టీ నేతల అభిప్రాయం. వీటన్నింటినీ పక్కనపెట్టి బీజపీ నేత కన్నా లక్ష్మీనారాయణ గెలుపు కోసమే జగన్ ఇన్ ఛార్జిని మార్చారన్న ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడెనిమిది నెలల సమయం ఉంది. ఈలోగానే లోపాయికారీ ఒప్పందాలు, వీక్ క్యాండెట్లను ఖరారు చేసే ప్రక్రియ ప్రారంభమవుతాయా? అన్న సందేహం కూడా కలుగుతుంది. అసలు బలహీన అభ్యర్థిని నిలబెడితే కన్నాఎలా గెలుస్తారు? టీడీపీకి అడ్వాంటేజీ కాదా?

మరి వీటిసంగతేంటి?

అలాగయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి రాధాను తప్పించడం అక్కడ టీడీపీ అభ్యర్థి బోండా ఉమకు మేలు చేయడంకోసమేనా...? చిలకలూరి పేటలో మర్రి రాజశేఖర్ పక్కన పెట్టడం ప్రత్తిపాటి పుల్లారావుకు మేలు చేయడం కోసమేనా? అన్నది కూడా ఆలోచించుకోవాలన్న వ్యాఖ్యలు సర్వత్రా విన్పిస్తున్నాయి. ఇక పార్లమెంటు సభ్యుల విషయానికొస్తే నాలుగైదు పార్లమెంటు స్థానాల్లో పురంద్రీశ్వరి, కావూరి సాంబశివరావుల లాంటి వారి కోసం జగన్ బలహీన అభ్యర్థులను దింపుతారన్న ప్రచారాన్నీ బాబు అనుకూల మీడియా చేస్తుంది. పాదయాత్రలో దాదాపు 11 నెలలుగా ఉన్న జగన్... అధికారంలోకి వస్తామన్న ఆశతో ఉన్న జగన్....ఎంపీ అభ్యర్థులను బలహీనమైన వారిని దింపితే ఆ ప్రభావం శాసనసభనియోజకవర్గాలపై పడదా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏపార్టీ అధినేత అయినా ఆ పిచ్చి పని చేసే ప్రసక్తి ఉండదు.

నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ.....

నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ ఇదే మీడియా జగన్ బీజేపీ అగ్రనేతలను కలిశారని త్వరలోనే ఆ పార్టీతో జత కడతారని కథనాలను వండి వార్చింది. అప్పుడు నంద్యాల ఎన్నికలు టగ్ ఆఫ్ వార్ గా జరుగుతున్న సమయంలో ఈ కథనాలు నిత్యం దర్శనమిచ్చాయి. నంద్యాలలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతోనే ఈ రకమైన ప్రచారానికి దిగారంటున్నారు. అప్పట్లో బీజేపీతో చంద్రబాబు నేరుగా సంబంధాలున్నప్పటికీ, జగన్ తో లోపాయికారి సంబంధమంటూ ఊదరగొట్టారు. జగన్ కేసుల కోసమే బీజేపీ అగ్రనేతల సీట్లలో బలహీనమైన అభ్యర్థులను నిలబెడతారన్న ప్రచారం ఎన్నికలకు ఏడాది ముందే స్టార్ట్ అయింది. భవిష్యత్తులో జగన్ పై ఇంకెంత రాతల దాడి జరుగుతుందో చూడాలి.

Similar News