రేపటి ఎంపీ ఎన్నికల్లో వైసీపీకి పాతిక సీట్లకు గాను 21 వస్తాయని లేటెస్ట్ గా ఓ సర్వే ప్రకటించింది. అంటే జనంలో జగన్ కి అంత ఊపు ఉంది మరి. అటువంటి పరిస్తితులను సొమ్ము చేసుకోవడానికి ఆ పార్టీకి గట్టి నాయకులు లేకపోవడం కలవరపెడుతోంది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఎమ్మెల్యే కంటే ఎంపీ క్యాండిడేట్లు సెలెక్షన్ జగన్ కి చికాకుగా మారిందంటున్నారు.
అయిదు సీట్లకు సెర్చ్.....
ఉత్తరాంధ్రలో అయిదు ఎంపీ సీట్లు ఉన్నాయి. విశాఖ జిల్లాలో విశాఖ, అనకాపల్లి, అరకు, విజయనగరం, శ్రీకాకుళం ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు నోరున్న... పేరున్న నాయకుడిని ఆ పార్టీ ఎంపిక చేసుకోలేకపోయింది. విశాఖ విషయానికి వస్తే ఓ రియల్ ఏస్టేట్ బిల్డర్ ని ఇంచార్జ్ గా జగన్ నియమించారు. కానీ ఆయన రాజకీయంగా గట్టి నేపధ్యం ఉన్న వారు కాదు. జనాలకు కూడా అంతగా పరిచయం లేదు. అర్ధబలం అన్న ఒకే ఒక కారణంతో జగన్ ఎంపిక చేశారని అంటున్నారు. అవతల వైపు టీడీపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీ భరత్ లాంటి అభ్యర్ధిని బరిలో పెడితే వైసీపీకి ఇక్కడ చిక్కులు తప్పవంటున్నారు.
ఆమెకేనా....
ఇక అనకాపల్లి నుంచి చూసుకుంటే మాకవరపాలెం కి చెందిన వరుడు కళ్యాణికి ఇక్కడ ఎంపీ ఇంచార్జ్ గా నియమించారు. ఆమె కూడా జనంలో పరిచయాలు ఉన్న నాయకురాలు కాదు. బలమైన సామజికవర్గం ఉన్నా మిగిలిన అంశాలు తీసుకుంటే ప్రత్యర్ధి పార్టీ ముందు తీసికట్టు అవుతారని అంటున్నారు. అందువల్ల ఇక్కడ కూడా జగన్ వేరే వారి కోసం గాలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
అరకు కోసం.....
ఇక వైసీపీ అరకు ఎంపీ సీటుని 2014లో లక్ష ఓట్లకు పైగా తేడాతో గెలుచుకుంది. పార్టీలో కొత్తగా చేరిన కొత్తపల్లి గీతకు జగన్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఆ తరువాత ఆమె పార్టీ ఫిరాయించడంతో అక్కడ కొత్త వారిని దించాల్సిన అవసరం ఏర్పడింది. అరకు ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే కుంభా రవిని అనుకుంటున్నా ఎవరూ దొరకకపోతే ఆయన్నే ఎంపీకి పోటీలో దించాలని జగన్ చూస్తున్నారు. అలాగే సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరను కూడా ఎంపీ కోసం అడుగుతున్నారట.
విజయనగరంలో బిగ్ ఫైట్.....
ఇక విజయనగరం నుంచి ఏకంగా పూసపాటి రాజుల వారసుడు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఈసారి కూడా బరిలో ఉంటారు. ఆయన్ని ఢీ కొట్టాలంటే కష్టం. అందువల్ల మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అడుగుతున్నారట. ఆయన సై అంటేనేఇక్కడ బిగ్ ఫైట్ సాధ్యం. మరి ఆయన కాకపోతే మాత్రం వైసీపీకి సరైన క్యాండిడేట్లు లేరనే చెప్పాలి.
సిక్కోలులోనూ అంతే.....
ఇక శ్రికాకుళం ఎంపీసీటుకు టీడీపీ నుంచి సిట్టింగ్ కె రామ్మోహన్ రావు ఉన్నారు. ఆయన మీద పోటీకి గట్టి వారు కావాలి. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుని పోటీకి దింపాలని జగన్ అనుకుంటున్నారట. అయితే ఆయన ఎమ్మెల్యేకేనని అంటున్నట్లు తెలుస్తోంది. అలా కాకపోతే ఇక్కడ కూడా వైసీపీకి అభ్యర్ధి సెర్చింగ్ తప్పదని టాక్. మొత్తానికి చూసుకుంటే ఓట్లేసేందుకు జనాలు ఉన్నారని సర్వేలు అంటూంటే, అభ్యర్ధుల ఎంపిక మాత్రం వైసీపీ వల్ల కావడంలేదంటున్నారు. వీక్ క్యాండిడేట్లను పెడితే మాత్రం ఈజీగా టీడీపీ కొట్టుకెళిపోతుంది.