ఉత్తరాంధ్రలో జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ఉధ్రుతంగా సాగుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్న జగన్ ఈ నెలాఖరు నాటికి శ్రికాకుళం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. అక్కడ మొత్తం భారీ షెడ్యూల్ ప్రకటించారు. ఈ ఏడాది చివరి వరకూ జగన్ సిక్కోలులోనే పర్యటించనున్నారు. అందుకు తగిన ప్రణాళికలు ఆయన రూపకల్పన చేసుకున్నారు.
అలెర్ట్ అయిన జగన్....
సిక్కోలులో జగన్ పాదయాత్ర సుమారుగా రెండు నెలల పాటు కొనసాగనుంది. అక్కడ మామూలుగా అయితే నెల రోజుల్లోనే ముగించాలని జగన్ భావించారు. అయితే తిత్లీ తుపాను వచ్చి అతలాకుతలం చేయడంతో జగన్ పాదయాత్రలో సైతం మార్పులు చేశారు. మొత్తం తుపాను బాధిత ప్రాంతాలన్నీ కవర్ చేసే విధంగా జగన్ యాత్ర ఉండబోతోంది.
విమర్శలకు జవాబు....
తిత్లీ తుపాన్ పెను బీభత్సాన్ని సృష్టిస్తే జగన్ పక్క జిల్లాలోనే ఉండి ఈ వైపు కన్నెత్తి అయినా చూడలేదని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. జగన్ కి రాజకీయం తప్ప జనం గురించి పట్టదని కూడా నిష్టూరమాడారు. దానికి జవాబు అన్నట్లుగా జగన్ తన మొత్తం యాత్రనే మార్చేశారు. ప్రతి ఇంటికీ వెళ్ళి మరీ తిత్లీ బాధితులను పరామర్శించాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.
పదునైన బాణాలు....
జగన్ నవంబర్ నెల నుంచి శ్రికాకుళంలో పాదయాత్ర చేపడతారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన విమర్శలకు పదునైన సమాధానాలు చెప్పేందుకు అంతా సిధ్ధం చేసుకున్నారు. ప్రతీ మాటకు జవాబు చెప్పడమే కాదు బాధితులకు ఎవరు అండగా నిలిచిందీ కూడా జగన్ చెప్పబోతున్నారట. ఇప్పటికే వైసీపీ తరఫున కమిటీలను వేసిన జగన్ కోటి రూపాయల పార్టీ ఫండ్ ని కూడా అక్కడ ఖర్చు చేశారు. రానున్న రోజుల్లో యాత్ర సందర్భంగా మరిన్ని హామీలు, భరోసా ఇచ్చేందుకు జగన్ సిధ్ధపడుతున్నారు. మొత్తానికి తిత్లీ తుపాన్ వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయ యుధ్ధానికి తెర తీసినట్లే కనిపిస్తోంది. జగన్ సిక్కోలు యాత్రలో ఇది క్లైమాక్స్ కి చేరుకుంటుందని అంతా భావిస్తున్నారు.