డౌట్ లేదు...అది వైసీపీదే..!!

Update: 2018-11-04 01:30 GMT

నర్శీపట్నం అసెంబ్లీ సీటు వైసీపీదేనా. అంటే నేతలు డౌట్ లేదంటున్నారు. 2014 ఎన్నికల్లోనే గెలుపు సాధించాల్సింది తృటిలో తప్పిపోయింది. ఈసారి మాత్రం చాలెంజ్ చేసి మరీ గెలుస్తామని చెబుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా నర్శీపట్నం టీడీపీ, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి గుప్పిట్లో పడి నలిగిపోయిందని చెబుతున్నారు. ఈసారి ఆ చెర విడిపించి ప్రజలకు మేలు చేస్తామని అంటున్నారు.

అయ్యన్న కుటుంబంలో ముసలం...

పార్టీలో గొడవలు ఉంటే సర్దుబాటు చేసుకోవచ్చు, కానీ ఏకంగా నాయకుడి ఇంట్లోనే కలహాల కుంపటి రగులుకుంది. ఈ మంటలను ఆర్పడం ఇపుడు ఎవరి తరం కాదన్నది నిజం. అయ్యన్న సైతం చేతులెత్తేసిన ఈ వివాదం పార్టీని సైతం ఓ కుదుపు కుదుపుతోంది. తన అన్న కొడుకు విజయ్ పాత్రుడు పార్టీలో పెత్తనం చేస్తున్నాడంటూ అయ్యన్న తమ్ముడు, నర్శీపట్నం మునిసిపాలిటీ వైఎస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు ఏకంగా చంద్రబాబుకే ఫిర్యాదు చేశారు. దీంతో వివాదం రచ్చకెక్కింది.

తమ్ముడే బలం....

నిజానికి అయ్యన్నకు తమ్ముడే బలం. పార్టీలో పలు మార్లు అయ్యన్న గెలవడం వెనక తమ్ముడు సన్యాసి పాత్రుడు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండేది కూడా సన్యాసిపాత్రుడే. మంత్రిగా అయ్యన్న బిజీగా ఉంటే పార్టీ పనులు చక్కబెట్టి, కార్యకర్తల సమస్యలు తీర్చేది ఆయనే. మరి అటువంటి తమ్ముడు ఇపుడు తిరుగుబాటు చేశాడు. అది అయ్యన్నకు నిజంగా శరాఘాతమేనంటున్నారు.

వారసత్వం పేచీ....

అయ్యన్న కుటుంబంలో వారసత్వం పేచీ జరుగుతోంది. తానే అన్నకు వారసుడిని అని సన్యాసిపాత్రుడు భావిస్తూంటే తాను సిసలైన నాయకుడిని అని విజయ్ అంటున్నారు. ఈ దశలోనే గొడవ మొదలైంది. అయ్యన్న సైతం ఇద్దరికీ చెప్పలేకపోతున్నారు. సహజంగానే అయ్యన్న కొడుకు విజయపాత్రుడి వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో తమ్ముడికి మండుకొస్తోందంటున్నారు.

వైసీపీ ఫుల్ ఖుషీ....

ఈ పరిణామాలతో వైసీపీ ఫుల్ ఖుషీగా ఉంది. అయ్యన్న కుటుంబంలో విభేదాలు చోటుచేసుకోవడంతో ఈసారి అక్కడ ఎగిరేది వైసీపీ జెండాయేనని గట్టిగా నాయకులు చెబుతున్నారు. అయితే వైసీపీలో కూడా వర్గ పోరు ఉంది. మాజీ ఎమ్మెల్యే ముత్యాలపాప, ఇంచార్జ్ ఉమా శంకర్ ల మధ్యన వివాదాలు ఉన్నాయి. వీటిని సరిచేసుకుంటే ఈసారి నర్శీపట్నం వైసీపీదే అనడంలో సందేహం లేదంటున్నారు.

Similar News