అదే ఎత్తుగడయితే చిత్తుకాక తప్పదు జగన్.....!!

Update: 2018-11-09 01:44 GMT

విశాఖ జిల్లాలో వైసీపీకి క్యాడర్ ఉంది. జనాల్లో ఆదరణ కూడా ఉంది. కానీ అందరినీ కలుపుకుని పార్టీ నావను ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చే సమర్ధ నాయకత్వం కొరవడిదని చెప్పాలి. జగన్ ఆ మధ్యన విశాఖలో పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఎక్కడ చూసిన ఇసుక వేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నది ఆ విధంగా స్పష్టమంది. టీడీపీ ఎమ్మెల్యేలపైన ఎక్కడ చూసినా వ్యతిరేకత బాగా ఉంది. మరి దాన్ని సొమ్ము చేసుకునే చాకచక్యం వైసీపీకి ఉందా....?

సంస్థాగతంగా లోపాలు....

వైసీపీకి మొదటి నుంచి విశాఖ జిల్లా కొరుకుడు పడడంలేదు. జగన్ ప్రత్యేక దృష్టి సారించినా కూడా పార్టీ దారిలో పడలేదు. 2014 ఎన్నికల్లో ఈ లోపాలే పార్టీకి పెద్ద దిక్కు, గౌరవ అధ్యక్షురాలు ఆయిన వైఎస్ విజయమ్మను దారుణంగా ఓడించాయి. ఆ తరువాత నుంచైనా సరైన గుణపాఠాలు వైసీపీ అధినాయకత్వం నేర్చుకోలేదు. జగన్ ఇక్కడకు అనేక సార్లు వచ్చి నిర్వహించిన ఆందోళన‌లు అన్నీ జయప్రదం అయ్యాయి. ప్రత్యేక హోదాపై చేపట్టిన జై ఆంధ్రప్రదేశ్ భారీ సభ జనంతో పోటెత్తింది. అయినా ఆ తరువాత ఫ్యాన్ పార్టీ ఆ ఊపుని కొనసాగించలేకపోయింది.

విఫల విపక్షం....

విశాఖలో వలస నేతల పాలన సాగుతోంది. హామీలన్నీ గాలికి వదిలేసి మంత్రులు ఎమ్మెల్యేలు సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు. విశాఖకు జీవనాడి లాంటి రైల్వే జోన్ హామీ అటకెక్కిపోయింది. ఉత్తరాంధ్రకు తాగు,సాగు నీరు అందించే పురుషోత్తమ పట్నం ప్రాజెక్ట్ నత్త నడకగా సాగుతోంది. విశాఖకు సరైన పరిశ్రమలు రాలేదు. అభివ్రుధ్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది. వెనకబడిన జిల్లాలకు కేంద్రం ఇవ్వాల్సిన నిధులు వెనక్కిపోయాయి. అయినా వైసీపీ పెద్దగా అందోళనలు చేసింది లేదు. అధికార పార్టీని నిగ్గదీసింది లేదు. మరో వైపు భూ కుంభకోణాలు యధేచ్చగా జరిగినా శాంతి భద్రతలు ప్రశ్నార్ధకం అయినా కూడా వైసీపీ నేతల్లో చలనం లేదు. దాంతో ఎన్నో అవకాశాలను ఆయుధాలుగా చేసుకోవడంలో వైసీపీ విఫలమైందని చెప్పాలి.

ధీటైన నేతలేరీ....

ఇప్పటికీ టీడీపీలో పెద్ద నాయకులంతా ఉన్నారు. నోరున్న నేతలు అనేకమంది అక్కడ కనిపిస్తారు. వైసీపీ విషయానికి వస్తే పార్టీ పరంగా పదవులు ఇచ్చి బాధ్యతలు అప్పగించినా నాయకులు జనంలోకి వెళ్ళడం లేదు. పైగా ఎవరూ కూడా వారి నియోజకవర్గం దాటి వస్తే పలకరించే స్థాయి లేదు. ఇక ఇంచార్జ్ లను తీసుకుంటే డబ్బుంది అన్న ఒక్కటే అర్హత తప్ప వారి ముఖాలు ఏవీ జనాలకు తెలియడం లేదు. మరి వీరిని పెట్టుకుని రేపటి ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీని ఓడించాలని వైసీపీ కలలు కంటోంది. ఇది సాధ్యమేనా.

జగన్ పేరు మీదనేనట....

జగన్ మ్యానియా బలంగా ఉందని నమ్ముతున్న విశాఖ జిల్లా వైసీపీ నేతలు ఆ పేరు చెప్పుకుని గెలిచేయవచ్చు అని భావిస్తున్నారు. అయితే పార్టీ, నాయకుడి ఇమేజ్ కొంతవరకూ ఉపయోగపడినా ధీటైన అభ్యర్ధిని కూడా జనం చూస్తారన్న సంగతిని మరచిపోతున్నారు. 2014 ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. టీడీపీ బలమైన నాయకులను ఎన్నికల్లో దింపితే వైసీపీ జగన్ ని నమ్ముకుని చతికిలపడింది. మరి ఈసారి కూదా అదే ఎత్తుగడతో ముందుకు వస్తే మాత్రం చిత్తు కాక మానదని పార్టీలోని శ్రేయోభిలాషులే హెచ్చరిస్తున్నారు. మరి, ఇప్పటికైనా వైసీపీ హై కమాండ్ సర్దుకుంటుందా.

Similar News