టిక్కెట్ రాకుంటే టీడీపీలోకే....!!!

Update: 2018-11-10 05:00 GMT

గుంటూరు జిల్లాలో పల్నాడుకు ముఖద్వారమైన గురజాల నియోజకవర్గంలో విపక్ష వైసీపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఇక్కడ నుంచి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న కాసు మహేష్‌ రెడ్డి పరిస్థితి అడ‌క‌త్తెర‌లో పోకచెక్కలా మారింది. నరసారావుపేటకు చెందిన కాసు ఫ్యామిలీ అక్కడ సుదీర్ఘ‌ కాలంగా రాజకీయాలు చేస్తోంది. కాసు మహేష్‌ రెడ్డి వైసీపీలో చేరేటప్పుడు ముందుగా ఆయన నరసారావుపేట సీటు ఆశించారు. అయితే అక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఉండడంతో జగన్‌ ఆయన్ను గురజాలకు పంపారు. అయితే బలవంతపు పెళ్లితో ఎన్ని రోజులు సంసారం చెయ్యగలరు అన్న చందంగా కాసు మహేష్‌ రెడ్డి గురజాలలో వైసీపీ రాజకీయం చేస్తున్నారు. గురజాలలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్ని విధాల బలంగా ఉండడంతో ఆయన్ని ఢీ కొట్టే విషయంలో సంకోచిస్తున్నా కాసు మహేష్‌ రెడ్డి తాను ఎప్పుడు నరసారావుపేటకు వెళ్లిపోదామా ? అన్న ఆలోచనతోనే ఉన్నారు.

ఉన్న పట్టంతా......

కాసు ఫ్యామిలీకి ఉన్న పట్టంతా నరసారావుపేటలోనే ఉండడంతో గురజాలలో ఆయన నియోజకవర్గ ఇన్‌చార్గ్‌గా ఉన్నా తూ... తూ మంత్రంగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడన్నది ఆ పార్టీ నాయకులే చెబుతున్న మాట. ఇటీవ‌ల మ‌హేష్‌రెడ్డి సైతం త‌న కంచుకోట అయిన న‌ర‌సారావుపేట‌లో పోటీ చేసేది తానే అని... అక్క‌డ ఎవ‌రో పోటీ చేస్తే తాను ఎందుకు స‌పోర్ట్ చేయాల‌ని సైతం త‌న అనుచ‌ర‌గ‌ణంతో కూడా అంటున్న‌ట్టు టాక్‌. ఇదిలా ఉంటే 20 రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నుంచి కాసు మహేష్‌ రెడ్డికి పిలుపు రాగా ఆయన చంద్రబాబును కలిసినట్టు గుంటూరు జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. పార్టీలో చేరితే నరసారావుపేట అసెంబ్లీ సీటుపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వగా కాసు మహేష్‌ రెడ్డి తన నిర్ణయాన్ని ఆలోచించి చెబుతానని కూడా చెప్పినట్టు తెలిసింది.

కోడెలతోనూ చర్చలు....

ఈ క్రమంలోనే పార్టీ సీనియర్‌ నేత స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావుని అంతకు ముందే పిలిపించుకున్న చంద్రబాబు కాసు ఫ్యామిలీని టీడీపీలోకి తీసుకుంటున్నాను... మీకేమైనా అభ్యంతరమా అని ప్రశ్నించగా ? అందుకు కోడెల తనకేమి అభ్యంతరం లేదన్న విషయాన్ని సైతం స్పష్టం చేసారట. అయితే కోడెల‌కు ఇటు స‌త్తెన‌ప‌ల్లితో పాటు అటు న‌ర‌సారావుపేట‌లోనూ ప‌ట్టు ఉండ‌డంతో కాసును మాచ‌ర్ల పంపాల‌ని కూడా ఆయ‌న బాబుకు చెప్పార‌ట‌. బాబు మాత్రం కాసుకు ఎక్క‌డ సీటు స‌ర్దుబాటు చేయాలో ? తాను చూసుకుంటాన‌ని చెప్ప‌డంతో పాటు ఆ ఫ్యామిలీ టీడీపీలోకి వ‌స్తే న‌ర‌సారావుపేట సీటే ఇస్తాన‌ని ప‌రోక్ష సంకేతాలు కూడా ఇచ్చిన‌ట్టు తెలిసింది.

నరసరావుపేట అయితేనే......

ఇదిలా ఉంటే కాసు మహేష్‌ రెడ్డి ప్రస్తుతం గురజాలలో పోటీ చేసేందుకు ఇష్టంగా లేరు. వచ్చే ఎన్నికలకు కాస్త ముందుగా అయినా నరసారావుపేట సీటు ఇస్తే అక్కడ నుంచే పోటీ చెయ్యాలని చూస్తున్నారు. అయితే అక్కడ నుంచి వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బలంగా ఉండడంతో జగన్‌ కాసుకు నరసారావుపేట కేటాయించని పక్షంలో ఆయన టీడీపీలోకి జంప్‌చేసి అయిన నరసారావుపేట నుంచి పోటీకి రెడీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. ఏదేమైనా ఎన్నికల వేళ‌ గుంటూరు జిల్లా రాజకీయాల్లో అనేక సంచలనాలు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Similar News