తెల్లం బలరాజు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పొలవరం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించిన మాజీ ఎమ్మె ల్యే. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్‌కు అత్యంత నమ్మకస్తుడైన గిరిజన ఎమ్మెల్యేగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇక, వైఎస్ మరణం.. తర్వాత మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన వైఎస్ తనయుడు జగన్‌కు జై కొట్టారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున బరిలోకి దిగి.. విజయం సాధించారు. అదే ఊపుతో 2014లోనూ పోలవరం టికెట్‌ను సంపాయించి వైసీపీ తరఫున పోటి చేసినా.. అప్పటి టీడీపీ అభ్యర్థి మొడియం శ్రీనివాస్ పై పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో టికెట్ సంపాయించాలని భావిస్తున్నారు.
స్థానికంగా వైసీపీలో.....
అయితే, జగన్ కూడా బాలరాజుకు మొగ్గు చూపుతున్నా.. స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు మాత్రం బాలరాజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు స్థానికంగా వ్యతిరేకత పెరుగుతోందని, టికెట్ ఇచ్చినా ఓటమి ఖాయమని జగన్‌కు వర్తమానం పంపుతున్నారు. దీంతో టికెట్ వచ్చే వరకు కూడా బాలరాజుకు నమ్మకం లేకుండా పోయింది. ప్రస్తుతం పోలవరం నియోజకవర్గంలో పాత ఐదు మండలాలతో పాటు ఇటీవల కలిసిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలోని మెజార్టీ మండలాల్లో మండల స్థాయి నాయకులు బాలరాజుకు సీటు ఇస్తే ఓడిస్తామని శపథాలు చేస్తున్నారు.
సీటు విషయంలో డైలమా....
నియోజకవర్గంలో మండల స్థాయి నాయకులు బాలరాజు మాకు వద్దని.. కొత్త వ్యక్తికి సీటు ఇవ్వాలని జగన్‌కు పలుసార్లు విన్నవించుకున్నారు. ఇక ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్ వైవి.సుబ్బారెడ్డికి సైతం ఇదే విషయాన్ని చెప్పినా వారు మాత్రం వీరి మాటను పక్కన పెట్టారు. ఇక సీటు విషయమై ఆందోళనలో ఉన్న బాలరాజు అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని, జగన్ దృష్టిలో పడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తి దాడిని తనకు అనుకూలంగా మార్చుకున్న బాలరాజు.. జగన్ ఆరోగ్యం బాగుండాలని కాంక్షిస్తూ.. మోకాళ్లపై నడిచారు. ఈ పరిణామం ఏజెన్సీ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
మోకాళ్ల మీద మొక్కులు....
జగన్ ఆరోగ్యం మెరుగుపడి త్వరగా కోలుకోవాలని కోరుతూ తెల్లం బాలరాజు పశ్చిమగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ తల్లి గుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మోకాళ్లపై నడుస్తూ మెట్లెక్కి మొక్కు చెల్లించుకున్నారు. ఇటీవల హత్యాయత్నంలో గాయపడిన వైఎస్.జగన్ త్వరగా కోలుకోవాలని ఈ పూజలు చేసినట్లు బాలరాజు చెప్పారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వైఎస్ జగన్‌ని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. కోట్లాది మంది అభిమానులు ఆయన వెంట ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ని ప్రజలు అఖండ ఆధిక్యంతో గెలిపిస్తారని చెప్పారు. రాబోయే రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే, బాలరాజు వ్యతిరేక వర్గం మాత్రం ఇది పొలిటికల్ స్టంట్ అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ తనకు టికెట్ దక్కడం సాధ్యం కాదని గ్రహించిన బాలరాజు.. జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకే ఇలా మోకాళ్ల యాత్ర చేశారని విమర్శిస్తున్నారు మొత్తానికి మరి బాలరాజు పాట్లు విజయం వరించేలా చేస్తాయో లేదో చూడాలి.