ఏపీ రాజధాని గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడికొండ విషయంలో వైసీపీ అధినేత జగన్ తీసుకున్న తాజా నిర్ణయం చర్చకు వస్తోంది. రాజధానిలో అత్యంత కీలకమైన ఎస్సీ నియోజవర్గంపై ఇలా అనూహ్య నిర్ణయం ప్రకటిస్తారని ఎవరూ ఊహించకపోవడంతో స్థానిక నాయకులు చర్చలో మునిగిపోయారు. 2009 ఎన్నికల్లోనూ ఇక్కడ కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌రావు విజయం సాధించి మంత్రిగా కూడా చేశారు. ఆ తర్వాత ఏపీ విభజనతో కాంగ్రెస్ ప్రజలకు దూరమైంది. దీంతో ఆ ఓట్లన్నీ కూడా.. ఇతర నియోజకవర్గాల్లో చాలా చోట్ల వైసీపీకి అనుకూలంగా మారాయి. అదేవిధంగా తాడికొండలోనూ జరుగుతుందని భావించినా.. ఇక్కడ ప్రయోజనం కనిపించలేదు. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో హెనీ క్రిస్టినా కతేరాను వైసీపీ అధినేత జగన్ ఇక్కడ నుంచి పోటీ చేయించారు.
గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతోనే....
అయితే, ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన తెనాలి శ్రావణ కుమార్ విజయం సాధించారు. ఇక, ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పోరు హోరా హోరీ సాగింది. తెనాలి శ్రావణ్ కుమార్‌కు 80 వేల పైచిలుకు ఓట్లు వస్తే.. వైసీపీ అభ్యర్తి క్రిస్టియానా 73 వేల ఓట్లు సాధించారు. దాదాపు 7 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో శ్రావణ్ కుమార్ విజయం సాధించారు. కట్ చేస్తే.. నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది. ఈ నాలుగేళ్లలో వైసీపీ అభ్యర్థి క్రిస్టియానా పెద్దగా ప్రభుత్వంపై విమర్శలు చేసింది లేదు. పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నా.. ఎదు రు దాడి చేయడంలో మాత్రం.. ఒకింత వెనుకబడే ఉన్నారు. దీంతో వైసీపీ తరఫున జగన్ ఇచ్చిన అనేక కార్యక్రమాలు ఎక్కడా ముందుకు సాగక పోవడం గమనార్హం. ఇక, అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పనితీరు కూడా మార్కులు సంపాయించుకోలేక పోయింది. ఇక్కడ రైతులను ఆయన సర్దుబాటు చేయలేకపోయారు.
బాబు డ్యాష్ బోర్డులో....
రాజధానికి భూముల విషయంలో శ్రావణ్ కుమార్ చంద్రబాబు విజన్ మేరకు ఉరుకులు పరుగులు పెట్టలేక పోయారు. దీంతో ఆయనకు బాబు డ్యాష్ బోర్డులో మైనస్ మార్కులు పడ్డాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున అభ్యర్థిని మార్చనున్నట్టు చెబుతున్నారు. ఇక్కడ నుంచి ప్రస్తుతం టీడీపీలో ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాదరావును తిరిగి పోటీకి నిలబెడతారని అంటున్నారు. ఇది జరిగితే.. వైసీపీకి బలమైన అభ్యర్థి అవసరం అనేది ఖాయం. ఈ నేపథ్యంలోనే జగన్ అటు ఆర్థికంగా, ఇటు స్థానికంగా కూడా తెలిసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
డాక్టర్ శ్రీదేవిని....
ఈ క్రమంలోనే తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఉన్నత విద్యావంతురాలు, డాక్టర్ శ్రీదేవిని వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దింపుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేస్తున్న శ్రీదేవిని జగన్ ఇప్పటికే సమన్వయకర్తగా నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇక్కడ స్థానికంగా ఉన్న క్రిస్టియానాకు ఉన్న ఆదరణ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు నాలుగు నెలల ముందు శ్రీదేవిని రంగంలకి దించితే నియోజకవర్గ ప్రజలు ఏమేరకు ఆదరిస్తారనేది ప్రశ్నార్థకం. ఇక, స్థానిక వైసీపీ కేడర్ కూడా.. శ్రీదేవికి జైకొట్టడం ఇప్పట్లో సాధ్యమేనా? అని సందేహాలు వినిపిస్తున్నాయి. మరి ఇక్కడ జగన్ వ్యూహం ఎంతమేరకు సక్సెస్ అవుతుందో ? చూడాలి.