జంప్ చేస్తే....జడుస్తానా...?

Update: 2018-08-06 02:00 GMT

వరుపుల, పర్వత కుటింబీకులే ప్రత్తిపాడు నియోజకవర్గ రాజకీయాలను రెండు దశాబ్దాలకు పైగా శాసిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలోని ప్రత్తిపాడు నియోజకవర్గానికి అనేక ప్రత్యేకతలు వున్నాయి. అటు తూర్పు ఏజెన్సీలోని ఏలేశ్వరం, రౌతులపూడి, శంఖవరం ప్రాంతాలు ప్రత్తిపాడు మండలం కలిపి ఈ నియోజకవర్గం ఓటర్లుగా వుంటారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానాన్ని గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి వరుపుల సుబ్బారావు గెలిచి ఆ తరువాత టిడిపి లోకి జంప్ అయ్యారు. వైసీపీ అధినేత జగన్ ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్నారు.

1989 నుంచి చూస్తే ...

కాపు సామాజికవర్గం, బిసిలు అధికంగా వుండే ప్రత్తిపాడు లో 1989 అసెంబ్లీ ఎన్నికల నుంచి గమనిస్తే నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముద్రగడ పద్మనాభం విజయం సాధించారు. ఆ తరువాత 1994 లో పర్వత సుబ్బారావు, 1999 లో పర్వత బాపనమ్మ టిడిపి తరపున, 2004 లో కాంగ్రెస్ తరపున వరుపుల సుబ్బారావు, 2009 లో తిరిగి పర్వత కుటుంబం నుంచి పోటీ చేసిన పర్వత సత్యనారాయణ మూర్తి టిడిపి నుంచి, 2014 లో వైసిపి నుంచి వరుపుల సుబ్బారావు లు గెలుపొందారు. అసెంబ్లీ కి ఇక్కడి నుంచి ముద్రగడ పద్మనాభం తప్పుకున్నాక పర్వత, వరుపుల కుటుంబాల నడుమే రాజకీయం సాగుతూ వచ్చింది.

వరుపుల టిడిపికి వెళ్లడంతో ...

వరుపుల సుబ్బారావు 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి 3413 ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి పర్వత సత్యనారాయణ మూర్తి పై విజయం సాధించారు. అంతకుముందు వరపులపై 2009 ఎన్నికల్లో 3286 ఓట్ల మెజారిటీతో పర్వత సత్యనారాయణ మూర్తి విజేతగా నిలిచారు. గత రెండు ఎన్నికలు పరిశీలిస్తే ఎవరు గెలిచినా వీరిద్దరి నడుమ మూడువేల ఓట్ల మెజారిటీ మాత్రమే తేడా వుంటూ రావడం చూస్తే పోటీ వీరిమధ్య ఏ స్థాయిలో సాగుతుందో తెలుస్తుంది. వరుపుల సుబ్బారావు వైసిపి నుంచి పార్టీ మారి పసుపు కండువా కప్పేయడంతో దశాబ్దాలుగా టిడిపి తో అనుబంధం వున్న పర్వత కుటుంబం వైసిపి వైపు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు కుటుంబాల నడుమ మరోసారి హోరాహోరీ పోరాటం తప్పదన్నది స్పష్టం అయిపోయింది.

కొత్త ముఖాలతో ...

ఈసారి ఎన్నికల్లో పర్వత, వరుపుల వారసులు రంగంలోకి దూకనున్నారు. సిట్టింగ్ ఎమ్యెల్యే వరుపుల సుబ్బారావు తన మనుమడు ప్రస్తుత కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మెన్ వరుపుల రాజాను టిడిపి నుంచి బరిలో నిలపనున్నారు. వైసిపి లోకి వెళ్ళిన పర్వత కుటుంబం నుంచి పర్వత ప్రసాద్ కి ఆ పార్టీ టికెట్ దాదాపు ఖాయం అయినట్లే అంటున్నారు వైసిపి నుంచి ఆయన సీన్ లోకి రానున్నట్లు తెలుస్తుంది. మరోపక్క జనసేన టికెట్ పై ఆశావహులు బాగానే వున్నారు. 2009 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి తోట వెంకటస్వామినాయుడు 30544 ఓట్లు సాధించి మూడో స్థానం సాధించిన చరిత్ర వుంది. ఈసారి జనసేన తరపున అభ్యర్థి ఎవరన్నది ఎన్నికల ముందు కానీ తేలే పరిస్థితి లేదు. ఈనేపధ్యంలో ప్రత్తిపాడు లో నువ్వా నేనా అనే పోరాటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.

Similar News