తూర్పుగోదావరి జిల్లాలో రెండునెలలపాటు వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర సాగి విశాఖ జిల్లాకు చేరుకుంది. జూన్ 12 న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రాజమండ్రి కి రోడ్ కం రైలు వంతెన ద్వారా పాదయాత్రగా చేరుకున్న జగన్ సరికొత్త చరిత్రను లిఖించారు. నాలుగున్నర కిలోమీటర్ల ఆసియా లో అతిపొడవైన వారధిపై జనం ఇసుకేస్తే రాలనంతగా విచ్చేసి తమ అభిమానం చాటుకున్నారు. గోదావరి జిల్లాల్లో ఒక్కసారిగా వైసిపి ఫీవర్ ఆ ఒక్క సీన్ తో వచ్చేసింది. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో నెలకొల్పిన అనేక రికార్డ్ లను తనయుడు జగన్ తిరగరాశారు. సుమారు మూడు వందల కిలోమీటర్లు రెండు నెలలపాటు నడిచి ప్రజలతో మమేకం అయ్యి కొత్త రికార్డ్ సృష్ట్టించారు.
అన్ని వర్గాలను కలుసుకున్న జగన్ ...
తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం, రంపచోడవరం రెండు నియోజకవర్గాలను మినహాయిస్తే మొత్తం కవర్ చేశారు వైసిపి అధినేత. రాజమండ్రి నుంచి ప్రారంభమైన ఆయన ప్రజా సంకల్ప యాత్ర రాజమండ్రి రూరల్, కొత్తపేట, పి గన్నవరం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, తాళ్లరేవు, రామచంద్రపురం, మండపేట, అనపర్తి, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో సాగింది. రాజమండ్రి, అమలాపురం, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పూర్తి అయ్యింది.
అందరిపై హామీల వర్షం ...
జగన్ అన్ని వర్గాలపై హామీల వర్షాన్ని కురిపించారు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో. ఏ నియోజకవర్గంలో పర్యటించారో అక్కడి స్థానిక సమస్యలు ప్రస్తావిస్తూ ఆకట్టుకున్నారు. ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, బిసి వర్గాలపై హామీలు గుప్పించారు. అగ్ర వర్ణ పేదలకు న్యాయం చేస్తామన్నారు. రైతులు, మత్స్యకారులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, అసంఘటిత రంగంలో వున్న వారు, డ్వాక్రా మహిళలు, న్యాయవాదులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాలను ఆయన కలుసుకోవడం లేదా పాదయాత్రలో ఆయా వర్గాలు వైసిపి అధినేత తో భేటీ కావడమో జరిగాయి. కొందరు సినీనటులతో సహా అనేకమంది వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. ముత్తా గోపాల కృష్ణ వంటివారు పార్టీకి గుడ్ బై కొట్టేశారు.
కాక రేపిన జగన్ ...
తూర్పు గోదావరి జిల్లాలో జగన్ పర్యటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శల దాడి, కాపు రిజర్వేషన్ అంశం కేంద్రం తేల్చాలన్న వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. దాంతో జగన్ తన వ్యాఖ్యల పరమార్ధాన్ని స్పష్టంగా చెప్పుకోవాలిసి వచ్చింది. ఒక పక్క మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మరోపక్క టిడిపి జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యేలా చేసింది. రాజకీయంగా వైసిపిలో ఈ అంశం ప్రకంపనలే సృష్ట్టించింది. చివరికి వైసిపి నేతలు, అధినేత ఇచ్చిన క్లారిటీ వివాదం సర్దుమణిగేలా చేసింది. తూర్పులో జగన్ టూర్ చివరి నియోజకవర్గం తుని లో సైతం అంతులేని అభిమానం జనం నుంచి రావడంతో వైసిపి శ్రేణులు తమ అధినేత పాదయాత్ర జోష్ లో మునిగితేలుతున్నాయి.