ఇంటెలిజెన్స్ విభాగాల నివేదికల ప్రకారం ప్రభుత్వాలు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ ఇంటిలిజెన్స్ అంచనాలతోనే నిన్నమొన్నటివరకు ఎపి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారులు వైసిపి కి అనుకూలంగా మారిపోతున్నారా ..? అవుననే అనుమానాలు జరుగుతున్న పరిణామాలు రాజకీయ మార్పులు సూచిస్తున్నాయి. తాజాగా మాజీ డిజిపి నండూరి సాంబశివరావు వైసిపి అధినేత వైఎస్ జగన్ ను కలుసుకోవడం ఈ అనుమానాలను బలపరుస్తుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడే సమయంలో ఈ కీలక పరిణామాలు అధికార పార్టీకి షాక్ మీద షాక్ ఇస్తుంటే విపక్ష వైసిపి లో సంబరాలకు దారితీస్తుంది. ఇతర పార్టీల్లో తీవ్ర చర్చకు తెరతీశాయి.
గాలి చూసే దూకేస్తున్నారా ...?
మాజీ డిజిపి సాంబశివరావు వాస్తవానికి ఏపీ డిజిపిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు చంద్రబాబు కి వీరవిధేయుడిగానే నడుచుకున్నారు. కానీ పూర్తి స్థాయి డిజిపి గా నియమిస్తారని పదవీకాలం పొడిగిస్తారని ఎదురు చూసిన ఆయన ఆశలు నెరవేరలేదు. వాస్తవానికి ఈ వ్యవహారంపై చంద్రబాబు పోరాడినా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఆయన నిర్ణయాలకు మోకాలడ్డాయి. తిమ్మిని బమ్మి చేసైనా సాంబశివరావు ను కొనసాగిస్తామని పైకి చెప్పిన ఎపి సర్కార్ ఆయనకు గట్టి షాక్ నే ఇచ్చింది. దాంతో అప్పటినుంచి ఆయన ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో వున్నారని తెలుస్తుంది.
పవర్ చేతిలో ఉండాలంటే ...
వీటితో బాటు ఇంటిలిజెన్స్ దగ్గర వున్న నివేదిక రాబోయేది వైసిపి సర్కార్ గా మొగ్గు చూపడం వంటి వాటితో సాంబశివరావు ఇక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడమే సరైన చర్య గా భావించి రంగంలోకి దూకారని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రత్యక్షంగా పోటీ చేస్తారా లేక ఎమ్మెల్సీ, రాజ్యసభ లకు వెళ్ళే ఆలోచన చేస్తారా అది కాక ఎదో ఒక కార్పొరేషన్ ఛైర్మెన్ గా పని చేస్తారా ఇవన్నీ కాక మరేదైనా అంశంపై జగన్ తో విస్తృతంగా చర్చించారా అన్నది త్వరలోనే తేలనుంది. ఇది ఇలా ఉంటే త్వరలో ఆయన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకుంటారని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారి ఎపి పాలిటిక్స్ లో హీట్ స్టార్ట్ అయ్యింది.