ఏపీ విపక్షం వైసీపీలో అభ్యర్థుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇక, అభ్యర్థులను వెతుక్కోవాల్సి న పరిస్థితి ఉందని ఇటీవల టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. అయితే, జిల్లా జిల్లాకు తరచి చూస్తే.. ఈ పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ లెక్కకు మిక్కిలిగానే నాయకులు కనిపిస్తున్నారు. ఇక, విజయవాడ, నెల్లూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కర్నూలు వంటి కీలక నియోజకవర్గాలు/జిల్లాల్లో అయితే, ఒక్కొక్క టికెట్‌కు ఇద్దరు నుంచి ముగ్గురు టికెట్ కోసం పోరాటం చేసుకుంటున్న పరిస్తితి కనిపిస్తోంది. ఇదిలావుంటే, స్థానిక నాయకులతోపాటు ఎన్నారై నాయకు లు కూడా వచ్చే ఎన్నికల్లో తమ సత్తా నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నారు.
పోటీపడుతున్న....
ఈ పరిణామం ఒక్క వైసీపీలోనే కనిపిస్తుండడం గమనార్హం. ఎన్నారైలుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు అనూహ్యంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో ఇద్దరికి పార్టీ అధినేత జగన్ కండువా కప్పి.. టికెట్ కూడా కన్ఫర్మ్ చేసినట్టు వార్తలు వచ్చా యి. ఇక, మరో నేతకు హామీ ఇవ్వకపోయినా.. ఆయన మాత్రం తాను దృష్టి పెట్టిన నియోజకవర్గంలో చురుగ్గా వ్యవహరిస్తు న్నాడు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎవరెవరు ప్రయత్నిస్తున్నారన్న విషయంతో సంబంధం లేకుండా.. తాను మాత్రం దూసుకుపోతున్నాడు. దీంతో వైసీపీలో ఎన్నారైల హవా పై ప్రత్యేక చర్చ కొనసాగుతోంది. విషయంలోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నుంచి ఎన్నారై కొఠారు అబ్బయ్య చౌదరి వైసీపీలో దూసుకుపోతున్నారు.
చింతమనేనిని ఓడించేందుకు.....
దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఓడించేలా అబ్బయ్య చౌదరి దూసుకుపోతున్నారు. వైసీపీ యూరప్, యూకే కన్వీనర్‌గా అక్కడ పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు అబ్బయ్య చౌదరి బాగా శ్రమించారు. ఇక, గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మెరుపులా తళుక్కున మెరిసిన విడదల రజనీ కుమారి కూడా ఎన్నారై. ఆమె మెట్టి నిల్లు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి మంత్రి ప్రత్తిపాటిని మట్టికరిపించాలని డిసైడ్ అయ్యారు . ఈ నేపథ్యంలో ఆమె కూడా తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆమె వైసీపీలో రోజా తర్వాత రెండో లేడీ ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడిపోయారు.
పలమనేరు నుంచి.....
ఇక, తాజాగా.. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం టికెట్‌ను ఆశిస్తున్న దయాసాగర్ రెడ్డి కూడా ఎన్నారై. ఈయన నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. వచ్చే ఎన్నిక్లలో పలమనేరు నుంచి పోటీ చేయాలని ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. మొత్తానికి ఈ ముగ్గురు ఎన్నారై అభ్యర్థుల విషయంపై తీవ్ర చర్చ సాగుతుండడం గమనార్హం.