వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధమవుతున్నారు. ఎన్నికలు మూడు నెలలు ముందే వస్తాయన్న సంకేతాల నేపథ్యంలో జగన్ ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ ను లీడర్లను అలెర్ట్ చేశారు. మరోవైపు పార్టీ అభ్యర్థుల జాబితాపైన కూడా జగన్ దృష్టి పెట్టారు. ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు బలమైన అభ్యర్థో ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చిన జగన్ తాను శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర ముగించే సమయానికి జాబితా ఒక కొలిక్కి వచ్చేయాలని భావిస్తున్నారు. అప్పుడే అభ్యర్థులు ప్రజల్లోకి వెళతారని, గడపగడపకూ ప్రచారం నిర్వహించగలుగుతారని భావిస్తున్న జగన్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రెండు ప్రయివేటు ఏజెన్సీలతో.....
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి అప్పడే మొదలయింది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 80 మంది అభ్యర్థుల జాబితాను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్న జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం సర్వేతో పాటు, మరో రెండు ప్రయివేటు ఏజెన్సీలతో సర్వేలు చేయిస్తున్నారు. ఈ సర్వే నివేదికలు కూడా ఒక నెలరోజుల్లో జగన్ చేతికి అందనున్నట్లు సమాచారం.
80 మందికి టిక్కెట్లు ఖరారు.....
ఇప్పటికే 44 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ దాదాపుగా అభ్యర్థిత్వాలను ఖరారు చేశారని తెలుస్తోంది. గత నాలుగున్నరేళ్లుగా తన వెంట నడిచిన అందరికీ ఈసారి కూడా టిక్కెట్లు ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. అలాగే వీరితో పాటు మరో 36 మంది అభ్యర్థుల జాబితా కూడా ఒక కొలిక్కి వచ్చిందంటున్నారు. వీరికి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకోవాల్సిందిగా జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన 95 స్థానాల్లోనే అభ్యర్థులను ఖారారు చేయాల్సి ఉంది. వీటిలో మాత్రం సర్వే నివేదికలు అందిన తర్వాతనే అభ్యర్థులను ఖరారు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.
ఇచ్ఛాపురం చేరుకునే సరికి.......
ప్రస్తుతం జగన్ విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్నారు. ఆయన ఈ నెల మూడో వారంలో విజయనగరం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలోనే మ్యానిఫేస్టోను ప్రకటించాలని కూడా జగన్ భావిస్తున్నారట. ఈలోపు అభ్యర్థుల జాబితా ఖరారై, మ్యానిఫేస్టో రూపొందితే పాదయాత్ర తర్వాత బస్సుయాత్రలో అభ్యర్థులను పరిచయం చేయవచ్చన్న ఉద్దేశంలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సర్వం సిద్ధంగా ఉండాలని జగన్ తన సైన్యానికి సూచించడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.