స్ట్రాంగ్ లీడర్ ‘‘రింగ్’’ లో జగన్.....?

Update: 2018-10-04 01:30 GMT

అస్సలు కలసి రాని నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్నారు. విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పొచ్చు. అక్కడ టీడీపీ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు స్ట్రాంగ్ లీడర్. ఆయనను ఢీకొట్టడ అంత ఈజీకాదు. 2009 వరకూ భోగాపురం నియోజకవర్గంగా ఉండేది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో నెలిమర్ల నియోజకవర్గంగా మారింది. పతివాడ నారాయణస్వామి అందరికంటే సీనియర్. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సమానంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది పతివాడ అరుదైన రికార్డును నెలకొల్పారు. ఆయన ఇలాకాలో ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్నారు.

ఏడుసార్లు విజయం సాధించి.....

గతంలో నెలిమర్ల నియోజకవర్గంగా ఏర్పడక ముందు భోగాపురం నియోజకవర్గం నుంచి పతివాడ నారాయణస్వామి నాయుడు ఆరుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. తర్వాత నెలిమర్ల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సూర్యనారాయణరాజును ఆరువేల ఓట్ల తేడాతో ఓడించారు.అయితే ఇదే నియోజకవర్గంలో 2009లో పతివాడ నారాయణ స్వామి ఓటమి పాలు కావాల్సి వచ్చింది. బొత్స సత్యనారాయణ సోదరుడైన కాంగ్రెస్ అభ్యర్థి అప్పలనాయుడు చేతిలో కేవలం 597 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం ఆరువేల పైచిలుకు ఓట్లను సాధించారు.

ఈసారి పోటీ చేస్తారా?

పతివాడనారాయణ స్వామికి వయస్సు పెరగడంతో ఈసారి పోటీ చేస్తారా? లేదా? అన్నది అనుమానమే. ఆయన స్థానంలో ఎవరిని బరిలోకి దించాలన్నదీ ఇంకా తెలుగుదేశం పార్టీ నిర్ణయించలేదు. ఆ నిర్ణయాన్ని పతివాడకే పార్టీ వదిలేసే ఛాన్సులున్నాయి. అయితే నారాయణ స్వామి మాత్రం తాను తిరిగి పోటీ చేయాలనే అనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లోనే తాను చివరిసారిగా పోటీ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెబుతున్నారు. ఇటువంటి చోట జగన్ పార్టీని నిలదొక్కుకునేలా చేసేందుకు పాదయాత్రను ప్రారంభించారు.

జగన్ స్ట్రాటజీ.....

అయితే స్ట్రాంగ్ లీడర్ ఉన్న చోట కూడా జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర సక్సెస్ కావడం విశేషం. నెలిమర్ల నియోజకవర్గంలో జగన్ పాదయాత్రకు విశేష స్పందన కన్పించింది. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ దగ్గరుండి మరీ పాదయాత్ర ఏర్పాట్లు చూస్తున్నారు. ఈసారి ఎలాగైనా పతివాడను ఓడించి తమ సత్తా చాటుతామని బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ స్ట్రాంగ్ లీడర్ ను మరో స్ట్రాంగ్ లీడర్ తో ఢీకొట్టేందుకు వైసీపీ రెడీ అయిపోతోంది. నెలిమర్ల నియోజకవర్గ ఇన్ ఛార్జిగా పెనుమత్స సాంబశివరాజు ఉన్నారు. ఆయనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. పతివాడ, పెనుమత్స పోటీ ఈసారి ఆసక్తికరంగా మారనుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

Similar News