ఆయన వైఎస్ భక్తుడు. ఆయన వల్లనే ఇరవైఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తరువాత మళ్ళీ 2009లో పాడేరు నుంచి పసుపులేటి బాలరాజు గెలిచారు. వైఎస్సార్ ఆయనను తన కేబినెట్లోకి తీసుకుని మంత్రిని కూడా చేశారు. అటువంటి నాయకుడు వైసీపీలో చేరకుండా ఎందుకు దారి తప్పారు. వేరే పార్టీలోకి ఎందుకు వెళ్ళారు. అంటే ఇక్కడ వైసీపీ నేతల వైఫల్యమే స్పష్టంగా కనిపిస్తోంది.
ఏజెన్సీలో బలమైన నేత.....
ఆయన మాజీ మంత్రిగానే కాదు, గిరిజన నాయకుడిగా కూడా జనంలో బాగా పేరు సంపాదించుకున్నారు. ఏ పార్టీలో ఉన్నా అంకిత భావంతో వుంటారు. 2014లో కాంగ్రెస్ ఓడిపోతుందని తెలిసి కూడా అదే పార్టీలో ఉన్న పసుపులేటి బాలరాజు ఇపుడు హఠాత్తుగా ఎందుకు పార్టీ మారారు అంటే ఆయనకు టీడీపీతో పొత్తు ఇష్టం లేదని చెబుతారు. అంతవరకూ బాగానే ఉన్నా ఆయన మొదటి ప్రయారిటీ వైసీపీ కదా మరి ఆ పార్టీలోకి ఎందుకు వెళ్ళలేదు అంటే వైసీపీ నుంచి సరైన లాబీయింగ్ లేకుండా పోయిందన్న సమాధానమే వస్తుంది.
వారంతా అంగుష్టమాత్రులే.....
విశాఖ జిల్లాలో వైసీపీ నాయకులు ఉన్నా వారంతా అంగుష్ట మాత్రులే. తమ ప్రాంతాలలోనే సరైన పలుకుబడి లేని వారిని ఇంచార్జులుగా అధినాయకత్వం నియమించింది. ఈ నేతలు హై కమాండ్ కి జిల్లా పరిస్థితి సరిగ్గా వివరించడంలోనూ తరచూ విఫలమవుతున్నారు. పార్టీని పటిష్టం చేయడంలోనూ తడబడుతున్నారు. బాలరాజు చాలాకాలంగా పార్టీ మారుతారని ప్రచారంలో ఉంది. పైగా వైసీపీలోకి వస్తారని కూడా చెబుతున్నారు. అటువంటి నేతను తీసుకురాలేకపోయారంటే అది పూర్తిగా విశాఖ జిల్లా నాయకుల లోపంగానే చూడాలి.
గిడ్డి ఈశ్వరి వెళ్లడానికి....
ఇక విశాఖ జిల్లా వైసీపీ వ్యవహారాలు చూసే జగన్ సన్నిహితుడు, రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా జిల్లాపై పెద్దగా దృష్టి సారించలేదని చెబుతారు. ఆయన అశ్రద్ధ కారణంగానే పాడేరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలోకి వెళ్ళిపోయిందని కూడా అంటారు. గిడ్డి ఈశ్వరికి సొంత పార్టీ వారే పొగ పెట్టారు. పార్టీలోకి బాలరాజు వచ్చేస్తున్నాడని ఊదరగొట్టారు. దీంతో అభద్రతాభావానికి గురై ఈశ్వరి వెళ్ళిపోయారు.
మూల్యం చెల్లించుకోక తప్పదా...?
తీరా చూస్తే ఇపుడు వస్తాడనుకున్న బాలరాజు సైతం ఝలక్ ఇచ్చేశారు. అంటే జిల్లాలోని వైసీపీ నాయకత్వం ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతోంది. వీటిని ఎప్పటికపుడు చక్కబెట్టాల్సిన వారు ఎవరూ లేకపోవడంతో పార్టీ నానాటికీ కునారిల్లుతోందంటున్నారు. ఏజెన్సీలో బలం ఉండి సరైన నాయకత్వం లేక రేపటి ఎన్నికల్లో వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోబోతోందని అంటున్నారు.