తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి రెండుసార్లే ఆ నియోజకవర్గంలో ఓటమి చవిచూసింది. అంటే ఆ నియోజకవర్గం తెలుగుదేశానికి ఏ స్థాయిలో పెట్టనికోట గా ఉందొ గణాంకాలు చూసి చెప్పేయొచ్చు. అదే తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం. ఇక్కడి నుంచి ప్రస్తుత ఏపీ ఆర్ధికమంత్రి 1983 నుంచి 2004 వరకు అప్రతిహతంగా శాసనసభకు ఎన్నిక అవుతూ వచ్చారు. ఆరు సార్లు ఓటమి ఎరుగని ధీరుడు యనమలకు 2009 లో తొలిసారి పరాజయం వెంటాడింది. పీఆర్పీ రూపంలో ఆయన గెలుపు చరిత్రకు గోడకట్టేసింది తుని ప్రజానీకం. ఆ ఎన్నికల్లో వైఎస్సాఆర్ ఆశీస్సులతో బరిలో నిలిచిన ఎస్ ఆర్ వివి కృష్ణం రాజు టిడిపి దిగ్గజాన్ని మట్టికరిపించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టేశారు. ఆ ఓటమి యనమలను ప్రత్యక్ష రాజకీయాలకే దూరం చేసేలా చేసింది. ఆ ఓటమితోనే సోదరుడు యనమల కృష్ణుడికి నియోజకవర్గ బాధ్యుడిని చేసి ఎమ్మెల్సీ గా చట్టసభలోకి గ్యాప్ లేకుండా అడుగుపెట్టేశారు రామకృష్ణుడు. ఆ తరువాత 2014 లోను వైఎస్సాఆర్ పార్టీ రూపంలో వచ్చిన కొత్త పార్టీ సైతం యనమల సోదరుడిని ఓడించి టిడిపి కోటలో జెండా ఎగురవేసింది.
యనమల రాజకీయ ప్రస్థానంలో తుని...
తూర్పు విశాఖ జిల్లాల సరిహద్దుగా వుండే ఈ నియోజకవర్గంలో ఓటర్లు విభిన్నంగా స్పందిస్తారు. కాపు, వెలమ సామాజిక వర్గాలు అధికంగా వుండే ఈ నియోజకవర్గంలో యాదవులు సంఖ్యా ఎక్కువే. క్షత్రియులు నియోజకవర్గంలో విజయాన్ని డిసైడ్ చేసేవారే. తొండంగి, తుని, కోటనందూరు మండల ప్రజలు తుని నియోజకవర్గంలో భాగంగా వుంటారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో వుండే తుని నుంచి ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన యనమల రామకృష్ణుడు ఎపి సీఎం చంద్రబాబు నాయుడు కి నమ్మిన బంటు. టిడిపి సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని గావించి, బాబు ను సిఎం చేయడంలో అసెంబ్లీ స్పీకర్ గా వున్న యనమల పాత్ర అందరికి తెలిసిందే. పార్టీకి గాలి వున్నా లేకపోయినా 1989 లో 2004 లో కూడా యనమల తుని నుంచి గెలిచి తన పట్టును నిరూపించుకున్నారు.
2004 లో ఓటమి అంచునుంచి ...
తెలుగుదేశం పార్టీలో కీలక నేత కావడంతో యనమల రామకృష్ణుడు ఓటమి కోసం ప్రత్యర్థి కాంగ్రెస్ వేయని ఎత్తు లేదు. 2004 లో వీచిన కాంగ్రెస్ గాలి కి తోడు వైఎస్ వ్యూహాలను ఎత్తుగడలకు ఎదురొడ్డి నిలిచి గెలిచారు యనమల. ఆ ఎన్నికల్లో ఎస్ ఆర్ వివి కృష్ణంరాజు యనమల నడుమ 3735 ఓట్ల తేడానే. దాదాపు యనమల పరాజయం ఖాయం అని భావించినా తానేమిటో నిరూపించుకుని గట్టెక్కారు ఆయన. కానీ 2009 లో పీఆర్పీ రూపంలో టిడిపి ఓటు బ్యాంక్ కి గండి పడిపోయింది. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి రొంగలి లక్ష్మి 30 వేల పైచిలుకు ఓట్లను చీల్చడంతో యనమల 8510 ఓట్ల తేడాతో తన చిరకాల ప్రత్యర్థి కృష్ణం రాజు చేతిలో మట్టికరిచారు. ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై కొట్టి రాజ్యసభకు వెళ్లాలని భావించినా ఆయన సేవలు రాష్ట్రానికి పార్టీకి అవసరమని భావించి చంద్రబాబు ఎమ్యెల్సీ గా ఎంపిక చేశారు.
2014 లో మరింత తగ్గిన యనమల జోరు ...
యనమల తన సీటు సోదరుడు కృష్ణుడికి అవకాశం 2014 లో కల్పించారు. ఆ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో ఘోరంగా యనమల కృష్ణుడు పరాజయం పాలై అన్న పరువు తీశారు. 18577 ఓట్ల తేడాతో యనమల కృష్ణుడు ఓటమి చెందడం విశేషం. వాస్తవానికి యనమల రామకృష్ణుడు ప్రతి విజయం వెనుక ఆయన సోదరుడు కృష్ణుడు కృషే దాగివుంటుంది. తుని లో రాజ్యాంగేతర శక్తిగా కృష్ణుడు దశాబ్దాలుగా కొనసాగుతున్నారన్న పేరు రాజకీయ వర్గాల్లో పేరుకుపోయింది. అయితే ఆయన తన అన్న స్థానంలో నిలిచి పోటీ చేసినా గెలుపు గుర్రం ఎక్కలేక పోవడం తూర్పు రాజకీయాల్లో సంచలనమే అయ్యింది.
2019 లో వీరి మధ్యే పోటీ ...?
వచ్చే ఎన్నికల్లో తుని నుంచి వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నే తిరిగి పోటీ చేయొచ్చని తెలుస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో గెలిచిన జ్యోతుల నెహ్రు, వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి వైసిపిని వీడి టిడిపిలోకి వెళ్ళినా ఎన్ని వత్తిడులు వచ్చినా దాడిశెట్టి రాజా పక్క చూపులు చూడలేదు. దాంతో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి లకు జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజా ఇక్కడ నుంచి యనమల కుటుంబంపై బరిలోకి దిగే పరిస్థితే వుంది. ఇక జనసేన ఇక్కడ నుంచి ఎవరిని పోటీకి దింపబోతుందన్న అంశం కీలక అంశంగాను విజేతను నిర్ణయించేదిగా వుంది. కాపు సామాజికవర్గం నుంచే జనసేన అభ్యర్థి ని నిలిపే పక్షంలో రాజా విజయం అంత సులువు కాదంటున్నారు విశ్లేషకులు. అదే బిసి సామాజిక వర్గ అభ్యర్ధికి జనసేన టికెట్ ఇస్తే టిడిపి కి గెలుపు కష్టమన్న టాక్ వినవస్తుంది. గతంలో పీఆర్పీలో చురుగ్గా వున్న యువత అంతా ప్రస్తుతం జనసేన జెండాలు కట్టడంతో తుని లో వచ్చే ఎన్నికలు రసవత్తర ఘట్టానికి దారితీయనున్నాయి.