ఆ మూడు పార్టీల ఆట‌పై అనుమానాలు.... బీజేపీ స్కెచ్‌..!

Update: 2018-04-06 18:29 GMT

కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాల‌ను నిర‌సిస్తూ సుమారు 17 విప‌క్ష పార్టీలు పార్లమెంటు సాక్షిగా నిర‌స‌న తెలిపాయి. కాంగ్రెస్‌, టీడీపీ, తృణ‌మూల్ కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, స‌మాజ్ వాడీ, బీఎస్పీ, డీఎంకే, ఎన్‌సీపీ, ఆప్‌, ఆర్‌జేడీ త‌దిత‌ర పార్టీలు ఏక‌మై మాన‌వ‌హారంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూపీఏ చైర్‌ప‌ర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్‌గాంధీ స‌హా వంద‌మందికిపైగా ఉభ‌య స‌భ‌ల ఎంపీలు ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ నిర‌స‌న తెలిపారు.

ఎందుకు పాల్గొనలేదు....

ఏపీకి ప్రత్యేక హోదా, బ్యాంకుల మోసాలు, రైతుల ఆత్మహ‌త్యలు, నిరుద్యోగం, మైనారిటీల అణ‌చివేత‌, ఎస్సీ, ఎస్టీల‌పై పెరిగిపోతున్న వేధింపులు త‌దిత‌ర అంశాల‌కు సంబంధించిన ప్లకార్డులు ప‌ట్టుకుని ఆందోళ‌న చేశారు. అయితే పార్లమెంటు ఆవ‌ర‌ణ‌లో ఆవిష్కృత‌మైన ఈ అరుదైన ఘ‌ట‌న‌లో ఆ మూడు పార్టీల ఎంపీలు మాత్రం పాల్గొన‌లేదు. పార్లమెంటు స‌మావేశాల్లోనూ వారు ప్ర్యతేకంగానే ఉన్నారు. ఇప్పడు కూడా అలాగే ఉన్నారు. ఇంత‌కు ఆ పార్టీలు ఏవీ.. ఎవ‌రా ఎంపీలు అనుకుంటున్నారు.. కొద్దిగా ఆలోచిస్తే ఈజీగా అర్థమై పోతుంది మ‌న‌కు.

వైసీపీ ప్రత్యేక హోదా కోసం.....

పార్లమెంటు స‌మావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల‌ని వైసీపీ, టీడీపీలు వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాలు ఇస్తున్నాయి. క‌లిసిమాత్రం ఉద్యమించ‌డం లేదు. రోజూ ఈ రెండుపార్టీలు అవిశ్వాస తీర్మానాలు ఇవ్వడం.. రాష్ట్రాల‌కే రిజ‌ర్వేష‌న్ల అమ‌ల అధికారం ఇవ్వాల‌ని తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలు, వావేరి జ‌లాల యాజ‌మాన్య బోర్డు ఏర్పాటు చేయాల‌ని త‌మిళ‌నాడుకు చెందిన అన్నాడీఎంసీ ఎంపీలు స్పీక‌ర్ వెల్‌లోకి వెళ్లి ఆందోళ‌న చేయ‌డం.. స‌భ స‌జావుగా జ‌రిగేలా, అవిశ్వాస తీర్మానాల‌పై చ‌ర్చ జ‌రిగేలా స‌భ్యులు స‌హ‌క‌రించాల‌ని స్పీక‌ర్ కోర‌డం.. అయినా ఆందోళ‌న విర‌మించ‌క‌పోవ‌డం.. చివ‌ర‌కు స‌భ వాయిదా ప‌డ‌డం.. నిత్యం ఇదే సీన్ రిపీట్ అయింది.

అన్నాడీఎంకే కావేరీ జలాలపై....

ఈ క్రమంలోనే అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీల‌పై ప‌లు విమ‌ర్శలు వ‌చ్చాయి. అవిశ్వాస తీర్మానం చ‌ర్చకు రాకుండా బీజేపీతో కుమ్మక్కు అయ్యి ఆందోళ‌న చేస్తున్నాయ‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. తాజాగా పార్లమెంటు సాక్షిగా సుమారు 17 విప‌క్ష పార్టీల ఎంపీలు మాన‌వహారంగా ఏర్పడి నిర‌స‌న తెలిపితే అన్నాడీఎంకే, వైసీపీలు మాత్రం ఇందులో పాల్గొన‌కుండా వేర్వేరుగా నిర‌స‌న తెలిపాయి. ఇక టీఆర్ఎస్ ఎంపీలు గురువారం ఉదయ‌మే సీఎం కేసీఆర్ సూచ‌న‌మేర‌కు హైద‌రాబాద్‌కు బ‌య‌లు దేరారు.

టీఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్ కు.....

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయ‌త్నం చేస్తున్న కేసీఆర్ స‌మావేశాలు ముగియ‌క‌ముందే హైద‌రాబాద్‌కు రావాల‌ని సూచించ‌డం గ‌మ‌నార్హం. ఇప్పడంతా ఇదే చ‌ర్చ. ఈ మూడుపార్టీల ఎంపీలు మాన‌వ‌హారంలో పాల్గొన‌క‌పోవ‌డంలో ఆంత‌ర్యమేమిట‌నే ప్రశ్నలు ఉత్పన్నమ‌వుతున్నాయి. మొద‌టి నుంచి అంద‌రూ ఊహించిన‌ట్లుగా బీజేపీతో టీఆర్ఎస్‌, వైసీపీ, అన్నాడీఎంల‌కు ఏదోఒక అవ‌గాహ‌న ఉంద‌నే అనుమానాలు ఇప్పుడు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

Similar News