రాజకీయాలు అంటేనే కులాధిపత్య పోరుగా మారిపోయింది. పేరుకు పార్టీలు, సిధ్ధాంతాలు కానీ కులం కార్డే ఎక్కువగా విజయానికి ఉపయోగపడుతోంది. అభ్యర్ధికి క్యాష్, కాస్ట్ ఉంటే చాలు టికెట్ కంఫర్మ్ అయిపోతోంది. అధినేతలు కూడా ఈ లెక్కలు చూసుకునే క్యాండిడేట్ సెలెక్షన్ చేస్తున్నారు. విషయానికి వస్తే విశాఖ జిల్లాలో ఓ బలమైన మంత్రి గారిని కొట్టాలంటే అంతకంటే బలమైన కులం కార్డ్ ని తీయాలని వైసీపీ డిసైడ్ అయింది. అందుకే అక్కడ ఆ కులానికి టికెట్ ఇస్తోందని అంటున్నారు.
దాంతో దెబ్బ....
ఇక భీమిలిలో ఏ కులం ఓట్లతోనైతే గంటా సులువుగా గెలుస్తూ వస్తున్నారో ఆ కులంతో సమానంగా ఉన్న మరో కులం యాదవ వర్గాన్ని జగన్ పార్టీ దువ్వుతోంది. ఆ యాదవులకు భీమిలీలో మంచి గట్టి మద్దతు ఉంది. వారి సామాజిక వర్గం ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక వారికి ఒక్క మారు కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశమే రాలేదు. సరిగ్గా ఇదే పాయింట్ మీద జగన్ ఇక్కడ గంటాకు గురి పెట్టారు. యాదవ బలంతో గంటాను ఓడించేందుకు వైసీపీ ప్లాన్ వేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే గంటాకు ఓటమి తప్పదని కూడా తేల్చేస్తున్నారు.
ధీమా వెనక......
ఇలా మంత్రి గారిని ఓడిస్తామని చెప్పడానికి మరిన్ని బలమైన కారణాలే ఉన్నాయని అంటున్నారు వైసీపీ నేతలు. మంత్రి వెనక ఉన్న గ్యాంగ్ భీమీలీలో దోపిడి విపరీతంగా చేశారని, ఆ చెడ్డ పేరు గంటాకు చుట్టుకుందని చెబుతున్నారు. ఇక భూ దందాలకు కొదవ లేదని, సిట్ క్లీన్ చీట్ ఇచ్చినా అసలు సంగతి బాధిత జనానికి తెలుసని వారు ఓటు వేసేటపుడు సరైన తీర్పు ఇస్తారని అంటున్నారు. అంతే కాదు టీడీపీలోనూ లుకలుకలు ఉన్నాయని, ఈసారి అవి గంటా ఓటమికి దారితీస్తాయని విశ్లేషిస్తున్నారు.
గంటాకు తంటాయేనా.....
విశాఖ అర్బన్ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు బాబు మంత్రి వర్గంలోనే బలమైన నేతగా ఉన్నారు. జిల్లాలో చూసుకున్న అయన హవాకు ఎదురులేదు. ఆయన భీమునిపట్నం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. మరో మారు అక్కడ నుంచే పోటీ చేద్దామని అన్నీ సిధ్ధం కూడా చేసుకున్నారు. ఇందుకోసం సర్వేలు చేయించి తానే గెలుస్తున్నట్లుగా ఫీలర్లు కూడా వదులుతున్నారు. అయితే ఇదంతా ఉత్తిత్తి ప్రచారం మాత్రమేనని, అక్కడ గంటా గెలిచే ప్రసక్తే లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి గారికి ఎదురుగాలి గట్టిగా వీస్తోందని, ఈసారి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోవడం ఖాయమని కూడా బల్ల గుద్ది మరీ చెబుతోంది. సామాజిక గణాంకాలు బాగానే ఉన్నాయి కానీ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.