తెలంగాణలో వైఎస్ ముద్ర ఇంకా చెరిగిపోలేదనిపిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల మనస్సుల నుంచి తొలగలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది. వైఎైస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆయనకు తెలంగాణలో గ్రామగ్రామాన అభిమానులున్నారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజాకూటమి పేరిట తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, తెలంగాణ జన సమతి, సీపీఐలు కలసి ఉమ్మడిగా పోటీలోకి దిగాయి. పొత్తులు కుదుర్చుకున్నాయి. కాంగ్రెస్ వాళ్లకు ఎటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకుడే. దీనిని ఎవరూ కాదనలేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేసి వివిధ పథకాలతో జనాదరణ చూరగొన్నారు.
రాజన్న హాట్ టాపిక్....
ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయంలో మరోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఈసారి పోటీ చేయడం లేదు. ఇటీవలే ఈ విషయాన్ని జగన్ పార్టీ ప్రకటించింది. 2023 ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసుకుని పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతో వైఎస్ అభిమానుల ఓట్లను సొంతం చేసుకునేందుకు టీఆర్ఎస్, టీడీపీలు కూడా ప్రయత్నిస్తుండటం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే.
బాబు సయితం ప్రచారంలో....
అయితే గత కొద్ది రోజులుగా చంద్రబాబు తెలంగాణలో చేస్తున్న ప్రచారంలో వైఎస్ పేరును ప్రస్తావించకపోయినా హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ చేసిన సేవలను కొనియాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తరచూ వైఎస్ చేపట్టిన పథకాలను ముఖ్యంగా జలయజ్ఞం, పోలవరం ప్రాజెక్టుపై విరుచుకుపడే చంద్రబాబునాయుడు తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ కు కితాబులివ్వడం చూస్తుంటే వైఎస్ ప్రభావం ఇంకా ఉందనేది స్పష్టమవుతుంది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాలు ఇప్పటికీ ప్రజల మనస్సుల్లో ఉండటంతో కాంగ్రెస్ నేతలతో పాటు టీడీపీ నేతలు కూడా తమ వాహనాలపై వైఎస్ ఫొటోను పెట్టుకుని ప్రచారం సాగిస్తుండటం విశేషంగానే చెప్పుకోవాలి.
వైఎస్ ఫొటోతోనే టీడీపీ.....
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించి దాదాపు తొమ్మిదేళ్లు కావస్తున్నా ఆయన పథకాలు మాత్రం తెలంగాణ ప్రజల్లో నాటుకుని పోయి ఉండటం ప్రచారానికి వెళుతున్న రాజకీయ నేతలను సయితం ఆశ్చర్యం కల్గిస్తుంది. ముఖ్యంగా సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వైఎస్ ఫొటో, ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలను తమ ప్రచార రథం పై ఉంచారు. కాంగ్రెస్ తో జత కట్టడంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సండ్ర వెంకటవీరయ్య సయితం తన ప్రచార రథంపై వైఎస్ ఫొటో ముద్రించి తిరుగుతున్నారు. దీన్ని బట్టి చూస్తే వైఎస్ ప్రభావం తెలంగాణలోనూ ఏ మాత్రం చెక్కుచెదరలేదనిపిస్తోంది. అందుకే చంద్రబాబునాయుడు సయితం తన ప్రచారంలో వైఎస్ పేరెత్తకున్నా.... కాంగ్రెస్ పనితీరును పొగడకుండా ఉండలేకపోతున్నారు. జననేత అంటే నిజంగా వైఎస్ అనే తెలంగాణ ఎన్నికలు నిరూపిస్తున్నాయని చెప్పకతప్పదు.