జగన్‌ను చూస్తే ఏమనిపిస్తోందని.. ఇటీవల ఓ మీడియా సంస్థ మాజీ సీఎం, తమిళనాడుకు గవర్నర్‌గా కూడా పనిచేసిన సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు (ప్రస్తుతం యాక్టివ్‌గా లేరు) కొణిజేటి రోశయ్యను ప్రశ్నించింది. దీనికి ఆయన ఇచ్చిన సమాధానం..'జగన్ మధ్యాహ్నపు సూర్యుడు'- అని! ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమే!! రోశయ్య ఏమీ అన్యాపదేశంగా( అనాలోచితంగా..) చెప్పలేదు. ఇప్పుడు ఏపీలో జగన్ పరిస్థితి మధ్యాహ్నపు సూర్యుడిగా రాజకీయాల్లో మెరుస్తున్నాడనే చెప్పాలి. అందుకే.. నిన్న మొన్నటి వరకు కూడా చంద్రబాబుతోనే తనకు ఫైట్ ఉంటుందని చెబుతూ వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గత కొన్నాళ్లుగా జగన్‌ను టార్గెట్ చేసుకుని విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. సరే.. పవన్ విషయం ఇక్కడ అప్రస్తుతం. జగన్ గురించి మాట్లాడుకుందాం. రాష్ట్రంలో జగన్ ప్రారంభించిన పాదయాత్రతో ఆయన రేటింగ్ భారీగా పెరిగింది.
ప్రకాశంలో గత వైభవమేదీ?
ఇటు పేదలు, మహిళలు, పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు అన్ని వర్గాల్లోనూ ఆశలు చిగురించాయి. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందనే వారంతా భావిస్తున్నారు. మరి.. జగన్ పరిస్థితి ఇలా ఉంటే.. జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా పార్టీకి పట్టుకొమ్మ వంటి ప్రకాశంలో వైసీపీ ఎలా ఉంది? ఇక్కడ గత వైభవం ఉందా? వచ్చేఎన్నికల నాటికి ఎలా ఉంటుంది? వంటి అంశాలను తరచిచూస్తే.. కొంత వ్యతిరేక ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రకాశంలో వైసీపీ మునిగిపోయే నావలా ఉందని చెప్పక తప్పదనే వారుకూడా ఉన్నారు. మరి దీనికి కారణం ఏంటి? అంటే.. ఆధిపత్య పోరు! ప్రధానంగా ఈ జిల్లాను జగన్ ఇద్దరు తన అనుంగు సహచరులకు అప్పగించారు. వీరిలో ఒకరు వైవీ సుబ్బారెడ్డి(ఇటీవలే ఈయనను మార్చేశారు), మరొకరు జగన్‌కు మిత్రుడు, వైఎస్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. వీరిద్దరిలో బాలినేనిని వైవీని ప్రకాశం జిల్లా ఇంచార్జ్‌గా నియమించారు.
వీరిద్దరి ఆధిపత్యపోరులో....
బాలినేనికి ఒంగోలు రాజకీయాలు అప్పగించారు జగన్. ఈ ఇద్దరూ కూడా వరుసకు బావ, బావమరుదులు అవుతారు. అయితే, వీరి మధ్య రాజకీయంగా అంతులేని అంతరం ఉంది. దీంతో ఈ ఇద్దరు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరించారు. ఫలితంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే, ఇటీవల వైవీని మార్చి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇక్కడ బాధ్యతలు అప్పగించారుజగన్. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ, కీలకమైన సమయంలో ఇలా మార్పులు చేయడం ద్వారా ఆశించిన ఫలితం రాబట్టడం కన్నా.. ఆశించని ఫలితం ఇప్పటికే మెడకు చుట్టుకుంటోంది. ఇక, ఈ జిల్లాలోని నియోజకవర్గాల పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉంది. సగం నియోజకవ ర్గాల్లో నేతల మధ్య సమన్వయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అంతర్గత కలహాలు పార్టీకి పెనుశాపంగా మారాయి.
అశోక్ గతి పడుతుందని.....
ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచి వారికి దిశా నిర్దేశం చేసేందుకు ఎవరూ లేకపోవడం కూడా పార్టీకి ఇబ్బంది కరంగా మారిపోయింది. మరోపక్క, పలు నియోజకవర్గాల్లో ఉన్న నేతల్లో జగన్‌పైనే భయం పట్టుకుంది. నిజానికి ప్రజలపై వారికి భయం ఉండాలి. ప్రజల్లోకి వెళ్లి ఆ భయం పోగొట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. కానీ, నియోజకవర్గాల ఇంచార్జులను ఎడా పెడా మార్చేస్తుండడడంతో నేతల్లో 'ఎంత కష్టపడ్డా మా పరిస్థితి కూడా వరికూటి అశోక్(కొండపిలో నాలుగేళ్లు కష్టపడి పార్టీని నిలబెట్టిన తర్వాత ఇటీవల ఈయనను మార్చేశారు)లాగే మా పరిస్థితి కూడా మారిపోతుందని ఇక్కడి నాయకులు వగరుస్తున్నారు.
పుంజుకోకుంటే కష్టమే....
ఒక్క కొండపిలోనే కాదు, దర్శి, పర్చూరు, చీరాల, సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు లాంటి నియోజకవర్గాల్లోనూ ఎవరికి సీటు వస్తుందో ? తెలియక ఎవరికి వారు యయునాతీరే ? అన్న చందంగా ఉంటున్నారు. ఎన్నికలకు కేవలం నాలుగు మాసాలే సమయం ఉన్న నేపథ్యంలో నేతల్లో ఉన్న ఈ అభద్రతా భావాన్ని తొలగించాల్సిన అవసరం జగన్‌పై ఉంది. లేకుంటే పరిస్థితి.. పశ్చిమ గోదావరి(గత 2014 ఎన్నికల్లో ఒక్క సీటులోనూ వైసీపీ గెలవలేదు)గా మారిపోయినా.. ఆశ్చర్యం ఉండదు. ప్రకాశంలో ఒకప్పుడున్న పరిస్థితి నుంచి ఇప్పుడు టీడీపీ భారీ ఎత్తున పుంజుకుంది. దర్శి, పరుచూరు, ఒంగోలు, అద్దంకి, కొండపి, చీరాల వంటి నియోజకవర్గాల్లో తిరుగులేనిశక్తిగా టీడీపీ ఎదుగుతోంది. మరి ఈ సమయంలో వైసీపీ పుంజుకోకపోతే.. తీరని నష్టం తప్పదు!!