రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు కామన్. అధికారం దక్కించుకోవాలంటే ప్రత్యర్థిని చిత్తు చేయాల్సిందే. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడాలేదు. ఏ పార్టీ అయినా ఆఖరి లక్ష్యం అధికారమే! అంతెందుకు తనకు అధికారంతో పనిలేదని మాటలు చెప్పిన జనసేనాని పవన్ సైతం ఆఖరుకు అధికారం కోసమేనని మాట మార్చిన సంగతి తెలిసిందే. తనకు అధికారం లేదని జగన్ పదే పదే చెబుతున్నాడు.. నేనైతే పనిచేసి చూపిస్తాను.. అన్న పవన్ కూడా ఏమీ చేయలేక.. ఇప్పుడు తనను సీఎంను చేయాలని అప్పుడు అందరి బతుకులు మారుస్తానని హామీలపై హామీలు గుప్పిస్తున్నాడు. సో.. రాజకీయాల్లోకి వచ్చేవారికి ఏదైనాలక్ష్యం ఉంది అంటే.,. అది కేవలంగా అధికారమే!
ప్రధాన పోటీ ......
ఈ అధికారం కోసమే వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు ఏపీలో పోరాడుతున్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీలు హోరా హోరీ తలపడుతున్నాయి. అయితే, ప్రధానంగా పోటీ వైసీపీ, టీడీపీ మధ్యే ఉంటుందని అంటున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎత్తులు వేస్తుంటే.. వైసీపీ అధినేత జగన్ దానికి పై ఎత్తులు వేస్తున్నారు. మొత్తంగా రాజకీయం రసకందాయంగా మారిందనడంలో సందేహం లేదు. విషయంలోకి వెళ్తే.. రాజధాని నగరంలో పట్టు సాధించడం కోసం జగన్ వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. మంగళగిరి, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు తూర్పు, మాచర్లలో మాత్రమే వైసీపీ ఫ్యాన్ తిరిగింది. అయితే, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వీటితో పాటు మెజార్టీ నియోజకవర్గాల్లో పాగా వేయాలని జగన్ భావిస్తున్నారు.
బాబు ఫార్ములానే.....
ఈ క్రమంలోనే చంద్రబాబు అనుసరించిన ఫార్ములానే ఆయన ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నాడు. అదే కమ్మ సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇవ్వడం. కీలకమైన గుంటూరు జిల్లాలో కమ్మ వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంది. దీంతో కమ్మ వర్గానికి చెందిన నాయకులను వైసీపీ టికెట్‌పై నిలబెట్టి తన ఖాతాలో వేసుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే వినుకొండ నుంచి బొల్లా బ్రహ్మనాయుడును, తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్‌ను, పొన్నూరు నుంచి రావి వెంకటరమణను, చిలకలూరిపేట నుంచి మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్యేగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు.
పెదకూరపాడు కూడా....
ఇక, అదేవిధంగా అత్యంత కీలకమైన మరో నియోజకవర్గం పెదకూరపాడు సీటు కూడా కమ్మ సామాజిక వర్గానికే ఇవ్వాలని భావిస్తున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ కాపు వర్గానికి చెందిన కావటి మనోహర్‌నాయుడు ఉన్నా కమ్మ వర్గానికే ఫైనల్‌గా సీటు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వర్గం నుంచి నంబూరి శంకర్‌రావు వైసీపీలో ఉండడంతో ఆయనకు టికెట్ ఖాయమనే మాట వినిపిస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లోనూ కమ్మ వర్గానికే చెందిన బొల్లా బ్రహ్మనాయుడు (ప్రస్తుత వినుకొండ సమన్వయకర్త ) పోటీ చేసి ఓడిపోయారు.
గుంటూరు ఎంపీగా ...
ఇక కీలకమైన గుంటూరు ఎంపీ సీటును ఇదే వర్గానికి చెందిన విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య తనయుడు లావు శ్రీకృష్ణదేవరాయులకు కన్‌ఫార్మ్ చేశారు. ఇప్పటికే ఆయన బలమైన పునాది వేసుకుని దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో ఈ సీటును జగన్ కాపు వర్గానికి చెందిన బాలశౌరికి ఇచ్చారు. ఇప్పుడు ఆయన ప్లేస్‌లో లావు శ్రీకృష్ణదేవరాయులు ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఐదు అసెంబ్లీ, ఓ ఎంపీ సీటు ఇచ్చి గుంటూరులో ఫ్యాన్ గాలి తిరిగేలా జగన్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని అంటున్నారు. జగన్ ప్లాన్ వల్ల బలమైన కమ్మ వర్గం ఓట్లలో భారీగా చీలిక రానుంది. ఇక తమ పార్టీకి సంప్రదాయంగా బలంగా ఉన్న ఓట్లతో ఈ సారి జిల్లాలో మెజార్టీ సీట్లను కైవలం చేసుకునే దిశగా జగన్ వ్యూహంతో ఉన్నారు.