వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొంత తగ్గింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలంటే ఆ నలుగురిపై చర్య తీసుకుంటే వస్తామని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై వత్తిడి ప్రారంభమయింది. దాదాపు పదిరోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు హాజరై ప్రజాసమస్యలను చర్చించాలని మేధావి వర్గాలు,ఇతర పార్టీల నేతలు కోరుతున్నారు. ప్రజాసమస్యలను పట్టించుకోకుండా జగన్ వీధుల వెంట తిరుగుతున్నారని ఇప్పటికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దెప్పిపొడుస్తున్న సంగతి తెలిసిందే.
అసెంబ్లీకి వెళ్లాలంటూ.....
ఇటీవల ఉద్యోగ సంఘాలు కూడా తమ డిమాండ్లపై జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని పట్టుబట్టాయి. దీంతో వైసీపీలో కొంత అయోమయం బయలుదేరింది. ప్రజాసమస్యలను శాసనసభలో చర్చించకుండా బహిష్కరించడం సరికాదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం విశాఖ జిల్లాలో పాదయాత్రలో ఉన్నారు. ఆయన పాదయాత్రకు విరామమిచ్చి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదు. మరో రెండు జిల్లాల్లో జగన్ పాదయాత్రను ఇంకా చేయాల్సి ఉంది. తమ పార్టీ గుర్తు మీద గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే తాము సభకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మొన్నటి వరకూ వైసీపీ చెబుతూ వచ్చింది. వారిపై అనర్హత వేటు వేసేంతవరకూ తాము సభలో అడుగుపెట్టబోమని చెప్పింది.
ఆ నలుగురిని తొలగిస్తే......
అయితే వివిధ వర్గాల నుంచి వస్తున్న వత్తిడితో వైసీపీ కొంత తగ్గినట్లే కన్పిస్తోంది. 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు కోర్టు పరిధిలో ఉన్నారు కాబట్టి అనర్హత వేటు అంశం తమ పరిధిలో లేదని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. దీంతో వైసీపీ స్వరం మార్చింది. 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పక్కన పెడితే నలుగురు మంత్రులను తొలగిస్తే తాము అసెంబ్లీకి వస్తామని వైసీపీ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. వైసీపీ నుంచి గెలిచిన అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, అమర్ నాధ్ రెడ్డి, సుజయకృష్ణ రంగారావులను కేబినెట్ లో చేర్చుకున్న సంగతి తెలిసిందే. వారిని మంత్రివర్గంలో చేర్చుకోవడం అనైతికత అని, వెంటనే వారిని తొలగిస్తే తాము సభకు రావడానికి రెడీగా ఉన్నామని వైసీపీ చెబుతోంది.
వెళ్లినా ప్రయోజనం లేదు......
తమ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు తమకు మంత్రులుగా సమాధాన చెప్పటమేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాము సభకు రావడానికి ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ సభకు వచ్చినా అక్కడ మాట్లాడే అవకాశం దొరకదని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాము ప్రజాసమస్యలపై ప్రశ్నించిన వెంటనే మైక్ కట్ చేయడం వారికి అలవాటుగా మారిందని, అటువంటి సభకు వెళ్లినా ఒకటే వెళ్లకున్నా ఒకటేనని ఆయన అన్నారు. తాము సభకు వెళ్లడం లేదని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేయడం సరికాదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. మొత్తం మీద పాత డిమాండ్ ను పక్కన పెట్టి ఆ నలుగురిపై చర్య తీసుకుంటే అసెంబ్లీకి వస్తామని వైసీపీ ప్రకటించడం విశేషం.