వైసీపీలోకి ఆ టీడీపీ ఎమ్మెల్సీ !!

Update: 2018-10-22 01:30 GMT

వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్సీ చేరిపోతారని విజయనగరం జిల్లాలో విస్త్రుత ప్రచారం సాగుతోంది. జిల్లాలోని సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఆర్‌పి భాంజ్ దేవ్ కి ఖరార్ అయిందన్న సమాచారంతో ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి అనుచరులు ఆవేశంతో రగిలిపోతున్నారు. పార్టీకి విశేష సేవ చేస్తే చివరికి ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదని వారంతా ఆవేదన చెందుతున్నారని ప్రచారం సాగుతోంది. సరైన గుణపాఠం చెప్పాల్సిందేనని ఆమెపై వత్తిడి పెరుగుతోందంట.

అదీ విషయం.....

సాలూరు నియోజకవర్గంలో గుమ్మడి సంధ్యారానికి, మాజీ ఎమ్మెల్యే భాంజ్ దేవ్ కి మధ్య వర్గ పోరు ఓ స్థాయిలో నడుస్తోంది. ఈ ఇద్దరి గొడవలు అధినాయకత్వం తీర్చలేక తలలు పట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. గత ఎన్నికల్లో అరకు ఎంపీ సీటు నుంచి టీడీపీ అభ్యర్ధిగా సంధ్యారాణి పోటీ చేసి ఓడిపోయారు. అపుడు భాంజ్ దేవ్ సరిగ్గా సహకరించలేదని ఆమె వర్గీయులు ఆరోపించారు. అలాగే ఎమ్మెల్యే గెలుపునకు కూడా ఆమె వర్గం సహకరించలేదని వాళ్ళలో ఉంది.

ఎమ్మెల్సీగా ఛాన్స్......

ఇక టీడీపీ అధినాయకత్వం సంధ్యారణికి, భాంజ్ దేవ్ కి కూడా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి సమ న్యాయం చేసింది. అయితే సాలూరు ఎమ్మెల్యే టికెట్ మీద కన్నేసిన ఆమె తనకు కచ్చితంగా వస్తుందని నమ్మారు. కానీ చివరికి అది పార్టీలో ప్రత్యర్ధి భాంజ్ దేవ్ కి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపైన ఈ మధ్యన సంధ్యారాణి ఇంట్లో మీటింగ్ జరిగింది. అమె మద్దతుదారులంతా హాజరై పార్టీకి రాజీనామా చేయాలని డిమాండి చేసినట్లు భోగట్టా.

టచ్ లో ఉన్న వైసీపీ......

టీడీపీలో జరుగుతున్న ఈ పరిణామాలను వైసీపీ ఆసక్తిగా గమనిస్తోంది. వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు సంధ్యారాణి వద్దకు రాయబారాలు కూడా నడిపారని ప్రచారం సాగుతోంది. తమ పార్టీలోకి వస్తే మంచి ప్రాధ్యాన్యతను ఇస్తామని కూడా చెబుతున్నారుట. ప్రస్తుతం జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాలోనే సాగుతోంది. మరి సంధ్యారాణి ఏ కఠిన నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉందంటున్నారు.

Similar News