వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకం అని తెలిసి కూడా వైసీపీలో ఇంకా తడబాట్లు జరుగుతూనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని, అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన పాదయాత్ర కూడా చేస్తున్నారు. అయితే, ఇదే వ్యూహం రాష్ట్ర వ్యాప్తంగా ఉందా? అనే సందేహం వ్యక్తమవుతోంది. పలు నియోజకవ ర్గాల్లో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. అధినేత జగన్ నిర్ణయాలు పార్టీ నేతలను తీవ్రంగా కలిచి వేస్తున్నాయి. దీంతో పార్టీలోని సీనియర్లు.. తీవ్రంగా నొచ్చుకుని రాజీనామాల బాట పట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో వైసీపీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడే సూచనలు కనిపిస్తున్నాయి.
రిజైన్ చేసేందుకు......
ఇక్కడ ఏళ్ల తరబడి వైసీపీని అంటి పెట్టుకుని, పార్టీ అబివృద్ది కోసం పాటుపడిన మర్రి రాజశేఖర్.. వచ్చే ఎన్నికల్లో టికెట్‌పై ఆశలు పెంచుకున్నారు. కింది స్థాయి కేడర్ కూడా బలంగా పనిచేసి.. మర్రిని గెలిపించేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంది. ఇంతలోనే వైసీపీ అధినేత జగన్ తన నిర్ణయాన్ని అనూహ్యంగా మార్చుకున్నాడు. ఇక్కడ నుంచి ఎన్నారై మహిళ విడదల రజనీకుమారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇది చిచ్చుపెట్టింది. దీంతో మర్రి సహా ఆయన కేడర్ మొత్తం పార్టీకి రిజైన్ చేసేందుకు రెడీ అయింది. ఈ వివాదం ఇంకా పచ్చిగానే ఉండగానే ప్రకాశం జిల్లాలోని అత్యంత కీలక నియోజకవర్గం కొండపిలోనూ ఇలాంటి సీన్ రిపీట్ అవుతోంది. ఇది పార్టీని తీవ్ర ఇబ్బందుల పాలు చేసేలా ఉందని అంటున్నారు పరిశీలకులు.
కొత్త ఇన్ ఛార్జిని నియమించడంతో.....
ఎస్సీ నియోజకవర్గం అయిన కొండపిలో వైసీపీ సమన్వయకర్తగా ఉన్న వరికూటి అశోక్‌కుమార్‌ను తప్పించేసి కొత్తగా రిటైర్డ్ డాక్టర్ మాదాసు వెంకయ్య నియామకం జరిగింది. ఇదే ఇప్పుడు ఇక్కడ వైసీపీలో అగ్గిని రాజేస్తోంది. గత ఎన్నికల్లో జూపూడి ప్రభాకరరావు(ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు) ఓటమి .. తర్వాత వరికూటి అశోక్ ఎంట్రీ ఇచ్చి నియోజకవర్గంలో పార్టీని బాగానే నడిపించాడు. ఆయన గత ఎన్నికల్లో బాపట్ల వైసీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిన వరికూట అమృతపాణికి స్వయానా సోదరుడు... అశోక్ భార్య కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో నియోజకవర్గంలో 40 వేల కమ్మ ఓటింగ్.. వీరికి ప్లస్‌గా మారుతుందని అందరూ అంచనా వేశారు. దీనికి తగ్గట్టుగానే నియోజకవర్గంలో బలమైన కమ్మ వర్గం అశోక్‌కు ఇప్పటి వరకు ఫుల్ సపోర్ట్‌గా ఉంటూ వచ్చింది.
చిచ్చురేపింది......
అన్ని రకాలుగా అశోక్ వైసీపీ నుంచి బలమైన అభ్యర్థి అవుతా రను కుంటున్న నేపథ్యంలో ఆయన్ను తప్పించేశారు. ఈ పరిణామం స్థానిక వైసీపీలో చిచ్చు రేపింది. ఇన్నళ్లుగా తాము పార్టీ జెండాలు పట్టుకుని వీధి వీధి తిరిగి అభివృద్ధి చేస్తే.. ఇప్పుడు టికెట్ మాత్రం వేరేవారికి ఎలా ఇస్తారు? అనే ప్రశ్నించే గొంతులు బయలు దేరాయి. దీంతో ఈ పరిణామం చిలికి చిలికి గాలివానగా మారినట్టు.. రాజీనామాల దిశగా సాగితే.. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ ఇక్కడ ప్రతిపక్షపాత్రకే పరిమితం కావాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరి జగన్ తన నిర్ణయాలను సమీక్షించుకుంటాడో లేదో చూడాలి. దీనికి తోడు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవి.సుబ్బారెడ్డి వేర్వేరు వ్యక్తులకు సపోర్ట్ చేయడం కూడా జిల్లాలో పార్టీ పరిస్థితి డేంజర్‌లో పడేందుకు కారణంగా కనిపిస్తోంది.