టీడీపీకి అత్యంత పట్టున్న అనంతపురంలో ఇప్పుడు నేతల వ్యవహారశైలి తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా మూడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పరిస్థితి తిరగబడేలా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అనంతపురం అర్బన్, పుట్టపర్తి, శింగనమల నియోజకవర్గాల్లో పరిస్థితి టీడీపీకి కలిసి రావడం లేదని చెబుతున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. గత ఎన్నికల్లో ఈ మూడు నియోజకవర్గాలను టీడీపీ కైవసం చేసుకుంది. అనంతపురం అర్బన్‌లో ప్రభాకర చౌదరి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, శింగనమల నుంచి మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు శమంతకమణి కుమార్తె యామినీ బాల గెలుపొందారు. అయితే, వీరిలో పల్లెకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడగానే మంత్రి పదవిని కట్టబెట్టారు.
యాక్టివ్ గా లేని పల్లె.....
అత్యంత కీలకమైన ఐటీ శాఖను పల్లె చేతిలో పెట్టారు చంద్రబాబు. అయితే, పల్లె ఈ శాఖను పుంజుకునే చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఒకపక్క తెలంగాణ ఈ విషయంలో పుంజుకుని పరుగులు పెడుతున్నా.. ఏపీలో మాత్రం ముందుకు అడుగులు పడలేదు. దీంతో సీఎం చంద్రబాబు ఆయనను తొలిగించారు. ఇక, వయో కారణాల రీత్యా కూడా పల్లె యాక్టివ్ గా కనిపించడం లేదు. ఆయన విద్యాసంస్థల నిర్వహణలోనే మునిగిపోతున్నారు. మొత్తంగా నియోజవ కర్గంపై తనదైన ముద్ర వేయడంలో పల్లె విఫలమయ్యారు. ఇక నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను ఆయన ఎంకరేజ్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మంత్రిగా విఫలమైన పల్లె... ఇటు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోనూ మంచి మార్కులు తెచ్చుకోలేకపోయారు. ఇక మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే నిమ్మల కిష్టప్ప సైతం వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఈ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం పల్లెకు తలనొప్పిగా మారింది. టిక్కెట్ విషయంలో పల్లెకు వచ్చిన ఇబ్బంది లేకపోయినా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆయన గెలుపు అంత సులువుగా లేదు.
నియోజకవర్గానికి దూరంగా.....
ఇక, శింగనమల విషయంలో యామినీ బాల కూడా ఇలానే పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గత ఏడాది జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. అయితే, తృటిలో ఆమె ఈ జాబితా నుంచి కిందికి జారుకున్నారు. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన యామినీ బాల ఈ ప్రభావం నియోజకవర్గంపై పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఇక, సొంత పార్టీలోనే పరిస్థితులు కలిసిరాక ఎదురు పోరాటం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తన కుమార్తెకు సీటు ఇప్పించుకునేందుకు శమంతకమణి తీవ్రస్థాయిలో శ్రమించి.... చంద్రబాబు వద్ద ఎంతో ఫైట్ చేశారు. అయితే ఇప్పుడు తళ్లీకూతుళ్లకే పొసగని పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో కుమార్తె సీటు కోసం స్వయంగా తల్లే ఎర్త్ పెట్టే పరిస్థితి వచ్చేసింది. ఈ సారి శమంతకమణి తన కుమారుడిని రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా విప్‌గా ఉన్న యామినీబాలకు సీటు ఇస్తే గెలిచే పరిస్థితి లేదు.
జేసీ ఎఫెక్ట్......
ఇక జిల్లా కేంద్రమైన అనంతపురం పట్టణ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి. చౌదరి సీటుపై కన్నేసిన జేసీ వర్గం.. ఈయనను తప్పించి.. ఈ సీటును తన వారికి ఇప్పించుకునేలా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యేకు పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇక్కడ ప్రభాకర్ చౌదరి ఎదురీత ఈదు తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు నియోజకవర్గాలలోనూ టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీడీపీలో విభేదాల కారణంగా ఈ మూడు చోట్ల వైసీపీ గెలుస్తుందన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. మరి వీటిని చంద్రబాబు ఎలా సెట్‌రైట్ చేస్తారో చూడాలి.