కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం వైసీపీలో రచ్చ జరగడం ఖాయమేనా? నేతల మధ్య ఆధిపత్య పోరు షురూ అవుతుందా? వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మరింత ముదురుతుందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ బీజేపీలో కీలకంగా ఉన్న నేత, రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు నేత మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి త్వరలోనే వైసీపీలో చేరనున్నారు. ఈ నెల 29న జగన్ పాదయాత్రలో భాగంగా గుడివాడలో వైసీపీ కండువా వేసుకోనున్నారు. పాణ్యం నియోజకవర్గం నుంచి ఐదు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. 60వేలకు పైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. కర్నూలు జిల్లాలో ఆయనకు మంచి పేరు ఉంది. పాణ్యం కింగ్‌గా ఆయన్ను పిలుస్తుంటారు.
వైసీపీ గూటిలోకి.....
గత ఎన్నికల్లో కాటసాని దెబ్బతో అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఎన్నికల అనంతరం కాటసాని కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. రాష్ట్ర నాయకుడుగా ఆ పార్టీలో చురుకైన పాత్రను పోషించారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీజేపీని వీడాలనే ఆలోచనకు వచ్చారు. కేంద్రంలోని మోడీ విధానాలపై ఏపీ ప్రజలు గుర్రుగా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి నూకలు చెల్లినట్టేనని పలువురు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఈ పార్టీలో ఉండి కూడా ప్రయోజనం లేదని భావించిన నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాటసాని కూడా తన దారి తాను చూసుకుంటూ.. వైసీపీ గుమ్మం తొక్కారు. ఈ కార్యక్రమానికి కర్నూలు నగరం, పాణ్యం, ఓర్వకల్లు, గడివేముల మండలాల నుంచి భారీ సంఖ్యలో నాయకులతో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జగన్ ఒకలా తలిస్తే....
ఇక, ఏ నేత లక్ష్యమైనా.. ఎన్నికల్లో గెలవడం, అధికారం చేపట్టడం! ఇప్పుడు కాటసాని చూపు కూడా అదేవిధంగా ఉంది. బీజేపీలో ఓటమి ఖాయమని తెలిసే.. కాటసాని బీజేపీకిరాం రాం చెబుతున్న నేపథ్యంలో వైసీపీలో చేరేది ఆయన గెలిచేందుకేనని అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఇక్కడే సీట్లు, టికెట్ల విషయం పెద్ద గందరగోళం ఏర్పడే ఛాన్స్ కనిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్.. కాటసానిని నంద్యాల ఎంపీగా చూడాలని భావించారు. ఈ క్రమంలోనే ఆ టికెట్‌ను ఖరారు చేయాలని భావించినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి నంద్యాల వైసీపీ ఎంపీ సీటు ఖాళీగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన ఎస్పీవై.రెడ్డి టీడీపీలో చేరిపోయారు. దీంతో ఇప్పుడు కాటసాని లాంటి బలమైన నాయకుడిని ఇక్కడ పోటీ చేయించి ఈ ఎంపీ సీటును తన ఖాతాలో వేసుకోవాలన్నదే జగన్ ప్లాన్.
పాణ్యం ఇవ్వాలంటూ.....
అయితే, కాటసాని మాత్రం తనకు పాణ్యం నియోజకవర్గం టికెట్ కేటాయించాలనే డిమాండ్‌తో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ డిమాండ్ గట్టిగా వినిపిస్తే మాత్రం వైసీపీలో అలజడి రేగినట్టే అంటున్నారు పరిశీలకులు. పాణ్యం నియోజకవర్గం నుంచి వైసీపీ నేత గౌరు చరిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాటసాని వైసీపీలో చేరితే గౌరును కాదని ఆయనకు వైసీపీ టికెట్ ఇస్తారా..? అంటే కష్టమేనని అంటున్నారు .అంతేకాదు.. గౌరు చరితా రెడ్డికి టీడీపీ నుంచి మంచి ఆఫర్ వచ్చినా కూడా ఆమె జంప్ చేయకుండా జగన్‌నే నమ్ముకుని పార్టీలో ఉన్నారు. మరి అలాంటి నేతను పక్కకు పెట్టి.. కాటసానికి పాణ్యం టికెట్ ఇవ్వడం అనేది సందేహమేనని అంటున్నారు పరిశీలకులు. ఇక, గౌరు భర్త వెంకట రెడ్డి జిల్లా ఇంచార్జ్‌గా ఉన్న నేపథ్యంలో వీరిని కెలికి .. జగన్ పెద్ద ముప్పుతెచ్చుకునే పొరపాటు చేయడని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి కాటసాని వ్యవహారం రచ్చకు దారితీసేలా ఉందని అంటున్నారు., ఏం జరుగుతుందో చూడాలి.