రాజకీయాల్లో చరిత్ర సృష్టించేవారు చాలా అరుదుగా ఉంటారు. బలమైన ప్రత్యర్థులు లేనప్పుడు గెలుపు గుర్రం ఎక్కి దానినే పెద్ద విజయంగా భావించే వారుఅనేక మంది ఉంటారు. ప్రత్యర్థుల వీక్ నెస్‌ను తమకు అనుకూలంగా మలుచు కుని గెలుపుగుర్రం ఎక్కేవారు కూడా ఉంటారు. అయితే, ప్రత్యర్థి బలమైన అభ్యర్థి అయినా.. ఎలాంటి వీక్ నెస్‌లు లేకపోయినా కూడా.. గెలుపు సాధించడం రాజకీయాల్లో రికార్డులను బ్రేక్ చేయడమే కదా?! అలాంటి రికార్డులు బ్రేక్ చేయడం, లేదా రికార్డులు సృష్టించడం ప్రముఖ రాజకీయ నేత, వ్యూహాత్మక వైఖరితో ముందుకు సాగే లీడర్ గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ! ఈయనకు రాజకీయాల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడం అంటే మహా ఇష్టం. సవాళ్లను అధిగమించడం అంటే మరీ ఇష్టం. ఈ క్రమంలోనే ఆయన వేసే ప్రతి అడుగు రికార్డుగా మారుతుంది.
సీనియర్లు సయితం ముందుకు రాక.....
తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన, సీనియర్ రాజకీయ నేత మాకినేని పెదరత్తయ్యను ఎన్నికల్లో మట్టికరి పించి రికార్డు సొంతం చేసుకున్నారు రావి వెంకటరమణ. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మాకినేని పెదరత్తయ్య హవా అంతా ఇంతా కాదు. 1980లలో ఆయన ఇక్కడ రాజకీయంగా చెలరేగిపోయారు. వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. అయితే, 2004లో వైఎస్ ఆశీర్వాదంతో ఇక్కడ నుంచి టికెట్ పొందారు రావి వెంకటరమణ. వాస్తవానికి మాకినేని వంటి పెద్దతలకాయను ఢీ కొట్టడం అంటే మాటలు కాదు. రావి వెంకటరమణ ఓ సామాన్య కార్యకర్త. 1983 నుంచి రెండున్నర దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాల్లో తిష్టవేసిన ఉద్దండ పిండుడు అయిన రత్తయ్యపై పోటీ చేసేందుకు చాలా మంది సీనియర్లు సైతం ముందుకు రాలేదు.
ఓటమి ఖాయమని పెద్దలు చెప్పినా.....
అంతకు ముందే రత్తయ్యపై బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న చేబ్రోలు హనుమయ్య, రాయపాటి శ్రీనివాస్ లాంటి వాళ్లు సైతం పోటీ చేసి ఓడిపోయారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌లోని సీనియర్లు చాలా మంది రావికి చెప్పారు. ''పెద్దగా ఖర్చు పెట్టకు. ఓటమి ఖాయం!'' అని చెప్పారట. అయినా కూడా రావి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నియోజవకర్గంలోని ప్రతి గడపను తొక్కారు. తనేంటో వివరించారు. తాను గెలిస్తే.. ఏం చేస్తానో వివరించారు. అంతే.. విజయం రావి ఖాతాలోకి వచ్చి పడింది. అప్పటి వరకు తనకు తిరుగులేదని భావించిన మాకినేని మౌనంగా నిష్క్రమించాల్సిన పరిస్థితిని కల్పించారు. ఇక, రావి.. ఐదేళ్ల పాటు ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధిపై చెరగని ముద్ర వేశారు.
వైఎస్ సహకారంతో.....
నాడు వైఎస్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. పిలిచి టికెట్ ఇచ్చిన వైఎస్ను ప్రాణంకన్నా మిన్నగా అభిమానించే రావి.. తర్వాత కాలంలో 2009లో ప్రత్తిపాడు ఎస్సీలకు రిజర్వ్ కావడంతో వైఎస్ సూచనల మేరకు నియోజకవర్గానికి పూర్తిగా కొత్త అయిన మేకతోటి సుచరిత గెలుపులో కీలకంగా వ్యవహరించారు. 2004-09 మధ్య రావి చేసిన అభివృద్ధి సుచరిత గెలుపులో కీలకంగా మారింది. ఇక, జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ స్థాపించాక రావి వెంకటరమణ ముందుగానే ఆ పార్టీలోకి వెళ్లారు.
సుచరిత గెలుపులో......
2012 ఉప ఎన్నికల్లో ప్రత్తిపాడు ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన సుచరిత గెలుపులో రావి కీలకంగా వ్యవహరించారు. సుచరితకు భారీ మెజార్టీ కూడా రావడానికి రావి కీలకంగా మారారు. ఇక, వచ్చే ఎన్నికల్లో రావి పొన్నూరు నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన గెలుపు అంచున ఉన్నా చివర్లో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ఇక్కడ కూడా ఐదుసార్లుగా గెలుపు గుర్రం ఎక్కుతున్న టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఉన్నారు. మరి ఈయనను కనుక ఓడించగలిగితే.. రావి మరో చరిత్ర తన ఖాతాలో లిఖించుకుంటాడు ? మరి రావి ఏం చేస్తాడో ? చూడాలి.