జ‌నసేన‌లోకి వైసీపీ మాజీ నేత‌.. ఎంపీగా చాన్స్‌

Update: 2018-03-22 08:30 GMT

ఏడాదిలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో నాలుగేళ్లుగా రాజ‌కీయంగా త‌ట‌స్థులుగా ఉన్న వారంతా ఇప్పుడు ఏదో ఒక పార్టీలోకి వెళ్లాల‌నే ఆలోచ‌న‌తో పావులు క‌దుపుతున్నారు. రాష్ట్రంలో త్రిముఖ పోరు త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు భావిస్తున్న నేప‌థ్యంలో.. ఏ పార్టీలో అడుగు పెడితే త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు ఢోకా ఉండ‌దో ఒక‌టికి పదిసార్లు ఆలోచించుకుని రంగంలోకి దిగుతున్నారు. కొంద‌రు ఇప్ప‌టికే ఈ విష‌యాల‌పై త‌మ అనుచ‌రుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతూ ఉండ‌గా.. మ‌రికొంద‌రు ఇప్ప‌టికే డిసైడ్ అయిపోయారు. ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడైన కొణ‌తాల రామ‌కృష్ణ‌.. ఇప్పుడు జ‌న‌సేన‌లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. కొద్ది కాలం నుంచి ఆయ‌న తీరు గ‌మ‌నిస్తున్న వారంతా దీనిని ధ్రువీక‌రిస్తున్నారు.

టీడీపీకి గుడ్ బై చెప్పడంతో....

ఏపీలో ఇప్ప‌టివ‌ర‌కూ టీడీపీ-వైసీపీ మ‌ధ్య ప్ర‌ధాన యుద్ధం జ‌రుగుతుంద‌ని అంతా భావిస్తూ వ‌స్తున్నారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీకి మ‌ద్ద‌తు తెలిపిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్‌.. ఈసారి ఈ రెండు పార్టీల‌కు గుడ్ బై చెప్పేశాడు. ఒక‌ప‌క్క హోదా పోరు తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ క్రెడిట్ త‌మ ఖాతాలోకి వేసుకునేందుకు అటు టీడీపీ, ఇటు వైసీపీ తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నాయి. ఇక ప‌వ‌న్.. ప్ర‌భుత్వ అవినీతిని ఎండ‌గ‌డ‌తానంటున్నాడు. అంతేగాక ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతాన‌ని స్ప‌ష్టంచేశాడు. ఈ నేప‌థ్యంలో త్రిముఖ పోరు త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో టీడీపీని వ్య‌తిరేకించే నాయ‌కులు జ‌గ‌న్ తో వెళ్లాలో లేక ప‌వ‌న్ తో వెళ్లాలో తెలియ‌క మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు.

విజయమ్మ ఓడిపోవడంతో....

విశాఖ జిల్లాకు సంబంధించి రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన‌ స‌బ్బంహ‌రి, దాడి వీర‌భ‌ద్రరావు, కొణ‌తాల రామ‌కృష్ణ వంటి నేత‌లంతా ప్ర‌స్తుతం త‌ట‌స్థంగా ఉంటున్నారు. అయితే దాడి వీర‌భ‌ద్ర‌రావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా లేదా అన్న‌ది ప‌క్క‌న పెడితే ఆయ‌న త‌న‌యుడు మాత్రం క‌చ్ఛితంగా ఎన్నిక‌ల బ‌రిలో దూకాల‌ని ప్ర‌యత్నిస్తున్నారు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి, ఆ త‌ర్వాత వైసీపీకి రాజీనామా చేసిన ఆయ‌న ఏ పార్టీలో చేర‌తార‌నేది ఆస‌క్తిగా మారింది.ఇక కొణ‌తాల రామ‌కృష్ణ మొద‌టి నుంచి కాంగ్రెస్ వాది. వైఎస్ హఠాన్మ‌ర‌ణంతో జ‌గ‌న్ కు అండ‌గా నిలిచారు. కానీ విశాఖ ఎంపీగా పోటీ చేసిన వైఎస్ విజ‌య‌మ్మ ఓడిపోవ‌టంతో కొణతాలపై జ‌గ‌న్ ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత దాడి వీర‌భ‌ద్రరావు వైసీపీలో చేర‌డంతో జ‌గ‌న్, కొణ‌తాల మ‌ధ్య దూరం తార‌స్థాయికి చేరాయి.

ఉత్తరాంధ్ర వేదిక ద్వారా....

త‌ర్వాత‌ కొణ‌తాల వైసీపీకి గుడ్ బై చెప్పేసి బ‌య‌టికొచ్చాడు. ఆ త‌ర్వాత టీడీపీలో చేర‌తార‌నే వార్త‌లు వ‌చ్చినా.. ఎటూ మొగ్గు చూప‌లేదు. ప్రస్తుతం కొణ‌తాల ఉత్త‌రాంధ్ర చ‌ర్చావేదిక‌ను ప్రారంభించి పోరాటం చేస్తున్నారు. ఈ మ‌ధ్య ప‌వ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన జాయింట్ యాక్ష‌న్ ఫైండింగ్ ఫ్యాక్ట్ క‌మిటీలో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. వ‌చ్చే ఎన్నికల్లో కొణ‌తాల రామ‌కృష్ణ క్రియాశీల‌క పాత్ర పోషించ‌బోతున్నార‌ని, అది కూడా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కోస‌మేన‌ని ఆయన అనుచ‌రులు వివ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా కొణ‌తాల జ‌న‌సేన తీర్థం పుచ్చుకుంటార‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అదే నిజ‌మైతే ప‌వ‌న్ కు కొణ‌తాల రూపంలో ఓ స్ట్రాంగ్ లీడ‌ర్ ల‌భించిన‌ట్లేన‌ని, కొణ‌తాల కారణంగా విశాఖ జిల్లా మొత్తం ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు రాజ‌కీయ మేధావులు.గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ ఎంపీ సీటును కొణ‌తాల ఆశించార‌ట‌. కానీ విజ‌య‌మ్మ రంగంలోకి దిగ‌డంతో.. ఆమె కోసం త‌న సీటును త్యాగం చేశారు. ఆ ఎన్నిక‌ల్లో తన శ‌క్తి మేర‌కు ఆమె త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హించారు కొణ‌తాల‌. కాబ‌ట్టి ఆశ‌ల‌న్నీ కొణ‌తాల రామ‌కృష్ణ‌పైనే విజ‌య‌మ్మ‌ పెట్టుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ అనూహ్యంగా ఆమె ఓడిపోవ‌డంతో మ‌రింత నిరాశ‌కు గురైన కొణ‌తాల సైతం పార్టీకి దూర‌మ‌య్యారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మ‌రి ఈసారి ప‌వ‌న్ జ‌న‌సేన‌తోనైనా విశాఖ ఎంపీగా బ‌రిలోకి దిగుతారేమో వేచిచూద్దాం!!

Similar News