ఆమె ఒక ఎంపీ!! ఒక పార్టీ టికెట్‌పై గెలిచారు.. కొన్నేళ్ల తర్వాత మరో పార్టీకి బయట నుంచి మద్దతు తెలిపారు. ఆ పార్టీ కండువా కప్పుకోలేదుగానీ.. పరోక్షంగా ఆ పార్టీలో చేరిపోయినట్టేనని అంతా భావించారు. మరి ఏమైందో ఏమో.. ఇప్పుడు ఆ పార్టీకి కూడా హ్యాండిచ్చేలా కనిపిస్తున్నారు. టికెట్ దక్కదని భావించారో లేదా అంతర్గత విభేదాలో లేక మరేదైనా కారణమో గానీ.. వేరే పార్టీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇక రేపో మాపో ఆ పార్టీలోకి వెళ్లిపోతారనే ప్రచారం కూడా జోరందుకుంది. నాలుగేళ్లలో రెండు పార్టీలు మారి మూడో పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న ఆ ఎంపీ మరెవరో కాదు.. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.
రేణుక ప్రధానిని ఎందుకు కలిశారు?
2014లో వైసీపీ నుంచి గెలుపొందిన ఆమె.. 2019 ఎన్నకలు వచ్చేసరికి బీజేపీలోకి వెళ్లిపోతారనే ప్రచారం జోరందుకుంది. ఏపీ ఎంపీలంతా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధాని మోడీని, బీజేపీని నిలదీస్తుంటే.. ఆమె ప్రధానిని కలిశారనే సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హోదా ఉద్యమంలో ఏపీ ఎంపీలు విడివిడిగానే పాల్గొంటున్నారు. కానీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. విభజన హామీలు నెరవేర్చాల్సిందేనని బీజేపీపై ముప్పేట దాడి చేస్తున్నారు. ఇక వైసీపీ ఎంపీలు రాజీనామాకు కూడా సిద్ధమవుతున్నారు.
పోరాటానికి దూరంగా....
అయితే ఈ పోరాటంలో కర్నూలు ఎంపీ రేణుక మాత్రం కనిపించిన దాఖలాలు లేవు. అసలు ఆమె పేరు కూడా వినిపించడం లేదు. పొలిటికల్ బ్యాగ్రౌండ్ పెద్దగా లేకున్నా.. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ఆమెకు 2014లో కర్నూలు ఎంపీగా పోటీచేసే అవకాశమిచ్చారు. అయితే ఇటీవల ఆమె.. ఏపీ అధికారపక్షంలోకి జంప్ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం బయటి నుంచి మద్దతు ఇస్తానని తెలిపారు. టీడీపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. అనధికార టీడీపీ ఎంపీగానే కొనసాగుతున్నారు. తాజాగా బాబుకు సైతం బుట్టా హ్యాండిచ్చారనే టాక్ వినిపిస్తోంది. ప్రత్యేక హోదా సాధన కోసం మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం.. ఆపై సభలో ఆందోళనలు చేస్తున్న వైనం తెలిసిందే.
టీడీపీకి హ్యాండ్ ఇస్తారా?
ఇంత హడావుడిలో ఏపీ తెలుగు తమ్ముళ్లు.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపడితే.. బుట్టా మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. అంతేకాదు.. మోదీ సర్కారుపై బాబు అదే పనిగా విమర్శల మీద విమర్శలు చేస్తున్న వేళ.. ఆమె మాత్రం అందుకు భిన్నంగా ఒక్కసారి గళం విప్పకపోవటం ఒక ఎత్తు అయితే.. ఇటీవల ప్రధాని మోడీని కలిసి వచ్చారన్న సమాచారం లీక్ అయ్యింది. ప్రస్తుతం ఆమె.. టీడీపీకి కూడా హ్యాండిచ్చారనే సమాచారం పొలిటికల్ వర్గాల్లో చక్కెర్లు కొడుతోంది.
అప్పటి పరిస్థితులకు అనుగుణంగా....
మోడీతో భేటీలో 2019 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని బుట్టా ముందు ఉంచినప్పుడు.. ఆమె తన సమాధానాన్ని చాలా ఆసక్తికరంగా చెప్పారు. అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తన నిర్ణయం ఉంటుందని తప్పించుకున్నారు. మరి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే!! అటు వైసీపీ టికెట్ మీద కొనసాగుతూ.. టీడీపీకి మద్దతు తెలుపుతూ.. బీజేపీ నేతలను కలవడంలో ఉన్న రాజకీయమేమిటో మరి!!