లాస్ట్ మినిట్ లో ఛేంజ్?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే నూట పదిహేను సీట్లకు అభ్యర్థులను అయితే ప్రకటించారు కానీ వారెవ్వరూ సంతోషంగా లేరు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే నూట పదిహేను సీట్లకు అభ్యర్థులను అయితే ప్రకటించారు కానీ వారెవ్వరూ సంతోషంగా లేరు. చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు ఉంటాయన్న ఆయన కామెంట్స్ వారికి నిదురలేకుండా చేస్తుంది. ఒకే దఫాలో వంద మందికి పైగా అభ్యర్థులను ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. అందులో ఎక్కువ మంది సిట్టింగ్ లే. అతి తక్కువ మందికి మాత్రమే టిక్కెట్లు ఈసారి దక్కలేదు. కొన్ని క్లిష్టమైన నియోజకవర్గాలలో అభ్యర్థును ప్రకటించకుండా పక్కన పెట్టారు. తనకు ఇప్పటి వరకూ అందిన సర్వే నివేదికల ప్రకారం కేసీఆర్ తొలి జాబితా అనే కంటే ఫుల్లు లిస్ట్ ను ప్రకటించి ఎన్నికలకు మూడు నెలలు ముందు రికార్డు బ్రేక్ చేశారు.
మరో భయం…
అదే సమయంలో మరో భయం కూడా సిట్టింగ్ లను వెంటాడుతుంది. వరసగా ప్రతి నెల కేసీఆర్ వివిధ సంస్థలతో సర్వేలు చేయిస్తుండటంతో తమ పేరు చివరకు గల్లంతయ్యే అవకాశాలు ఉంటాయన్న ఆందోళన నేతల్లో ఉంది. లిస్ట్ లో పేరు ప్రకటించగానే సరిపోదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ బీ ఫారం అందుకున్నప్పుడే అది కన్ఫర్మ్ అయినట్లు. అంత వరకూ ఊగిసలాట తప్పదు.అదే ఇప్పుడు గులాబీ పార్టీ నేతల్లో గుబులు బయలుదేరింది. వచ్చే సర్వే నివేదికలు తమకు ప్రతికూలంగా వస్తే ఏం చేయాలన్న దానిపై కూడా వారు ముఖ్య అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య సయితం తనకు చివరి నిమిషంలోనైనా టిక్కెట్ వస్తుందని చెప్పడం ఇందుకు అద్దం పడుతుంది.
చివరి నిమిషంలో…
ముందుగా సీటు లేదని తెలిస్తే ఇతర పార్టీలకు జంప్ అయ్యే అవకాశాలున్నాయి. చివరి నిమిషంలో సీటు దక్కకపోతే అప్పుడు ఇతర పార్టీలకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అంతేకాదు వారిని బుజ్జగించి పార్టీ ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ప్రకటించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టిక్కెట్ రాక జెండా మార్చడానికి ఏ నేతకూ అంతటి అవకాశం ఉండదు. ఇతర పార్టీలు కూడా వారిని స్వాగతిస్తాయి తప్పించి టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ లేదు కాబట్టి వారంతా బీఆర్ఎస్ లోనే కొనసాగక తప్పదు. అదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహమంటున్నారు. అందుకే దాదాపు సిట్టింగ్ లందరికీ సీట్లు అంటూ స్వీటు కబురు చెప్పారన్న వాదన ఒకవైపు వినపడుతుంది.
ఎమ్మెల్యేపైనే…
నిజానికి కేసీఆర్ మీద కన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వంపైన కన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనే ఎక్కువ అసంతృప్తి ఉందన్నది వాస్తవం. ఒక్కో ఎమ్మెల్యే రెండు, మూడు సార్లు వరసగా గెలవడం కూడా వారిపై వ్యతిరేకత పెరగడానికి కారణం కావచ్చు. ప్రజలు తమ నియోజకవర్గాల్లో సహజంగా మార్పు కోరుకుంటారు. ప్రభుత్వంపై అసంతృప్తి లేకున్నా లోకల్ సమస్యల పరిష్కారం కాకపోవడం వివిధ కారణాలతో ఎక్కువ మంది సిట్టింగ్ లపై ప్రజలు అసహనంగా ఉన్నారని చెబుతున్నారు. సంక్షేమ పథకాలను కూడా కొందరికే దక్కేలా వ్యవహరించడం కూడా ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమని కేసీఆర్ కు కూడా నివేదికలు అందాయి. దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుల్లో తమ వారికే న్యాయం చేశారని, కొందరు చేతి వాటం కూడా చూపారన్న ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ చివరి నిమిషంలో పెద్ద సంఖ్యలోనే మార్పులు చేస్తారంటున్నారు. అందుకే సిట్టింగ్ లకే సీటు అని గులాబీ బాస్ ప్రకటించినా బీ ఫారం అందే వరకూ వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది.