KCR : ఆ ఒక్కటి చేయకుంటే కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేవారుగా
రేవంత్ ప్రమాణం చూసిన గులాబీ పార్టీ నేతలు తమ అధినేత కేసీఆర్ ఆ ఒక్క తప్పు చేయకుంటే బాగుండేదని భావిస్తున్నారు.
మా అబ్బాయి అంత మంచోడు మరొకడు ఉండడు. వాడికి ఒకటే సుగుణం. ఒకరు చెబితే వినడు. తనంతటతాను తెలుసుకోడు. ఈ తెలుగు సామెత సీఎం కేసీఆర్‌కు మాత్రం ఖచ్చితంగా అతికినట్లు సరిపోతుంది. ఇప్పుడు తెలంగాణ అంతటా ఇదే చర్చ. కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పాలనలో సంక్షేమానికి కొదవలేదు. అభివృద్ధికి తిరుగులేదు. ఇటు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని.. అటు ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి కేసీఆర్ కృషి చేశారనే చెప్పాలి. తెలంగాణలో భూములకు సాగునీరు అందించి అందరి మన్ననలను పొందారు. ఎకరా లక్ష విలువ కూడా చేయని కోట్ల రూపాయల విలువ తెచ్చి పెట్టాడు. రైతులు, దళితులను, బీసీలను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలను తెచ్చి జనాలకు పంచి పెట్టారు.
అభివృద్ధిలో...
జిల్లాలను విభజించారు. ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇక దళితులు, మైనారిటీలకు, బీసీలకు ప్రత్యేక పథకాలను రూపొందించి అందరి మన్ననలను పొందారు. ఇక తిరుగులేదన్న నేతగా భావించిన కేసీఆర్ ఆయన వ్యవహార శైలి ఆయనతో పాటు పార్టీకి ముప్పు తెస్తుందని ఊహించనూ కూడా లేదు. తనను ప్రజలు పక్కన పెడతారని ఆయన భావించి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంత అభివృద్ధి చేస్తూ.. సంక్షేమంలో కూడా రాష్ట్రాన్ని దేశంలో కల్లా ముందు నిలిపిన తనను ప్రజలు ఛీత్కరించుకుంటారని ఊహించనూ లేదు.
సంక్షేమంలో...
కానీ అన్నీ చేసినా కేసీఆర్ జనంలో కలవకపోవడం.. ప్రగతి భవన్ ను వీడి రాకపోవడం ఆయనకు మైనస్ అయింది. తనకు తానే ప్రజలను దూరం చేసుకున్నారు. కేసీఆర్ సరిగా వ్యవహరించి ఉంటే నిజానికి తెలంగాణలో మరో దశాబ్దకాలం కేసీఆర్ కు ఎదురుండేది కాదు. నేతలను దగ్గరకు రానివ్వకపోవడం, ఎమ్మెల్యేలకు లబ్దిదారుల ఎంపిక బాధ్యతను అప్పగించడంతో ప్రభుత్వం ప్రజలకు దూరమయింది. కనీసం తమ గొంతు విప్పడానికి కూడా ఆయన అంగీకరించలేదు. స్వేచ్ఛను కాలరాశారన్న అపప్రథను మూటగట్టుకున్నారు.
అంతా చేసినా...
నియంతలా వ్యవహరించి కేసీఆర్ వల్ల రాష్ట్రం వచ్చినా.. బాగుపడినా.. ఆయన వ్యక్తిత్వం మాత్రం తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి చేసింది. విపక్షాలకు దొరల పాలన అంటూ నినాదాన్ని అందించింది కూడా కేసీఆర్ మాత్రమే. మరెవ్వరూ కాదు. ఆయనే బాగుంటే... అన్న సామెత ఇక్కడ అక్షరాలా కేసీఆర్ కు వర్తిస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కేవలం తక్కువ శాతం ఓట్లతో అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. ఫార్మ్ హౌస్ కు పరిమితం కావాల్సి వచ్చింది. ఇది ప్రజాస్వామ్య దేశమని విస్మరించిన కేసీఆర్ తన సొంత రాజ్యంలా భావించడమే పీఠానికి ముప్పు తెచ్చి పెట్టింది.