YSRCP : ఆ ఎమ్మెల్యేకు నో టిక్కెట్.. గెలిచే నేతకు జగన్ నుంచి పిలుపు.. ఇదే సిగ్నల్స్
జగన్ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని ఈక్వేషన్లు చూస్తున్నారు. సొంత సామాజికవర్గాన్ని కూడా పక్కన పెడుతున్నారు
వైఎస్ జగన్ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని ఈక్వేషన్లు చూస్తున్నారు. సొంత సామాజికవర్గాన్ని సయితం పక్కన పెట్టి గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తున్నారు. వివిధ సంస్థల సర్వేల నివేదికలతో పాటు సామాజిక కోణాన్ని కూడా జగన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. సామాజికవర్గాల వారీగా ఫ్యాన్ పార్టీ వైపు తిప్పుకునేందుకు ఈసారి గట్టి ప్రయత్నమే జగన్ చేస్తున్నారు. తలపండిన రాజకీయ నేతలకు సయితం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు మింగుడుపడటం లేదు. ఎవరినీ లెక్క చేయడం లేదు. ఒక్కటే దారి.. అదే గెలుపు బాట. అందుకోసం అయిన వారినయినా సరే పక్కన పెట్టేందుకు రెడీ అయిపోతున్నారు.
మద్దాలి గిరిని పక్కన పెట్టడంతో...
తాజాగా వైశ్య సామాజికవర్గానికి చెందిన మద్దాలి గిరిని కూడా జగన్ పక్కన పెట్టేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ గత ఎన్నికల్లో టీడీపీ నుంచ పోటీ చేసి గెలిచి తర్వాత వైసీపీ మద్దతుదారుగా మద్దాలి గిరి నిలిచారు. అయినా ఈసారి టిక్కెట్ రాదని చెప్పకనే చెప్పేశారు. మద్దాలి గిరి ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి చిలకలూరిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి విడదల రజనీని వైసీపీ ఇన్‌ఛార్జిగా నియమించారు. దీంతో వైశ్య సామాజికవర్గానికి చెందిన గిరికి ఇక టిక్కెట్ లేనట్లే. ఆయనకు మరో నియోజకవర్గం కేటాయించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఆయనకు మరో నామినేటెడ్ పదవి.. ఎమ్మెల్సీయో.. రాజ్యసభ పదవో ఇస్తానని చెప్పి ఒప్పించే వీలుందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారన్ని బట్టి తెలుస్తోంది.
వైశ్య సామాజికవర్గానికి...
దీంతో వైశ్య సామాజికవర్గానికి ఎక్కడి నుంచి ఇవ్వాలన్న దానిపై సహజంగానే చర్చ జరుగుతుంది. విజయనగరం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైశ్య సామాజికవర్గం నుంచి కోలగట్ల వీరభద్ర స్వామి, వెల్లంపల్లి శ్రీనివాస్ లు గెలిచారు. ఇద్దరిలో వెల్లంపల్లికి తొలి విడతలో మంత్రివర్గంలో స్థానం కల్పించారు. తర్వాత విస్తరణలో కోలగట్లకు డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు. అలా ఆ సామాజికవర్గాన్ని జగన్ దూరం చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు టీడీపీలో గెలిచి వైసీపీలో గెలిచిన మద్దాలి గిరి స్థానంలో మరొక వైశ్య సామాజికవర్గానికి చెందిన నేతకు టిక్కెట్ కేటాయించాల్సి ఉంటుంది. అది ఎక్కడ అన్న దానిపై క్లారిటీ దాదాపుగా వచ్చేసినట్లే నని తెలుస్తుంది. అయితే గుంటూరు జిల్లా నుంచి కాదు... పొరుగున ఉన్న ప్రకాశం జిల్లా నుంచి వైశ్య సామాజికవర్గానికి టిక్కెట్ కేటాయించే అవకాశముంది.
శిద్ధాకే అవకాశం...
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం టిక్కెట్ ను శిద్దా రాఘవరావుకు లేదా ఆయన కుమారుడు శిద్ధా సుధీర్ లలో ఒకరికి ఇస్తారని సమాచారం. ప్రకాశం జిల్లాలో బలమైన సామాజికవర్గంతో పాటు ఆర్థికంగా కూడా శిద్ధా కుటుంబం బలంగా ఉండటంతో ఆయనకే దర్శి టిక్కెట్ ఖాయమని చెబుతున్నారు. ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో మద్దిశెట్టి వేణుగోపాల్ గత ఎన్నికల్లో గెలిచి శాసనసభ్యుడిగా ఉన్నారు. అయితే అక్కడ మద్దిశెట్టికి, మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి మధ్య పొసగడం లేదు. ఇద్దరు నేతల మధ్య అంతర్గత వార్ నడుస్తుంది. దీనికి చెక్ పెట్టేందుకు శిద్ధా ప్యామిలీని జగన్ రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. అక్కడ రెడ్డి సామాజికవర్గం ఓటర్లు కూడా ఎక్కువగా ఉండటంతో గెలుపు సులువవుతుందని నమ్ముతున్నారు. ఎటూ అక్కడ జనసేన పోటీ చేస్తుందన్న అంచనాలు వినపడుతున్న నేపథ్యంలోనే శిద్ధాను ఎంపిక చేస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం.