అంబటి ప్లేస్‌లోకి ఆర్కే.? గుంటూరు వైసీపీలో కొత్త ట్విస్ట్.!
2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థి.. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌పై సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణ
గుంటూరు వైసీపీలో భారీ మార్పులు జరగబోతున్నాయా? వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యేలకు స్థాన చలనం కలగనుందా? సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి అంబటి మరో నియోజకవర్గం చూసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయా? అనే చర్చ ఉమ్మడి గుంటూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. వైసీపీలోకి మంగళగిరి బీసీ నేతల చేరికలతో కొత్త సమీకరణలు తెరమీదకొస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి సీటును ఆర్కేకు కేటాయించనున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థి.. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌పై సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ గతంలో మాటిచ్చారు. అయితే అప్పటికే మంగళగిరిలో కీలక నేతలుగా ఉన్న మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించి చక్రం తిప్పారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రధాన నియోజకవర్గంగా ఉన్న మంగళగిరి సీటును ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ అధినేత పావులు కదిపారు. పార్టీలో చేరిన నేతలు వియ్యంకులే కావడంతో తమకే టిక్కెట్ దక్కుతుందని భావించారు. అందరు నేతలను పార్టీలోకి చేర్చుకున్న తర్వాత అనూహ్యంగా లోకేష్‌ను రంగంలోకి దింపడంతో నేతలు అసహనానికి గురయ్యారు. టిక్కెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ కాండ్రు కమల బాహాటంగానే విమర్శలు గుప్పించారు కూడా.
అయితే గత ఎన్నికల్లో నారా లోకేష్ ఓటమితో నేతలు సహకరించలేదన్న వాదనలు వినిపించాయి. తదనంతరం మాజీ మంత్రి హనుమంతరావు సహా కాండ్రు కమల కూడా వైసీపీలో చేరిపోయారు. గత ఎన్నికల వేళ వైసీపీ నేతలతో అంతర్గత ఒప్పందం జరిగిందన్న ప్రచారం కూడా సాగింది. నారా లోకేష్‌పై గెలుపునకు సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో కీలకమైన చేనేత వర్గానికే పార్టీ టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు చర్చ నడిచింది. ఎట్టకేలకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే చంద్రబాబు తనయుడిపై ఘన విజయం సాధించి తీవ్ర పరాభవం రుచిచూపించారు.
ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా గతంలో ప్రచారంలోకి వచ్చిన వాదనలకు బలం చేకూర్చేలా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఆర్కే చేతిలో ఓటమిపాలైన గంజి చిరంజీవి వైసీపీలో చేరడం కొత్త చర్చకు తెరలేపింది. 2014లో చిరంజీవి ఓడిపోయినప్పటికీ ఆయనే టీడీపీ ఇన్‌చార్జిగా.. మున్సిపల్ చైర్మన్‌గా కొనసాగారు. పార్టీలో కీలక నేతగా చక్రం తిప్పారు. నారా లోకేష్‌కు సైతం అండగా నిలిచారు. టీడీపీ కీలక నేతగా ఉన్న ఆయన ఇటీవల వైసీపీ కండువా కప్పుకోవడంతో మంగళగిరి సీటు చేనేత వర్గానికి కేటాయించడం దాదాపు ఖరారైపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే అక్కడి నుంచి రెండు సార్లు గెలిచిన ఆర్కే సత్తెనపల్లి నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం సాగుతోంది. ఇటీవల సీఎం జగన్ చేయించిన సర్వేలోనూ అభ్యర్థులను మార్చాల్సిన అవసరముందన్న నియోజకవర్గాల్లో సత్తెనపల్లి, మంగళగిరి కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మంగళగిరిలో బీసీ నేతల చేరికలతో ఆర్కేకు స్థాన చలనం తప్పేలా కనిపించడం లేదు. దీంతో ఆయన సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబటి రాంబాబు మరో నియోజకవర్గానికి మారతారని చెబుతున్నారు. క్రిష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి అంబటి బరిలోకి దిగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఆర్కే సత్తెనపల్లి సీటును ఆశించి భంగపడ్డారు. 2009 ఎన్నికల్లో సీటు కోసం తీవ్రంగా శ్రమించారన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర్ రెడ్డికే టిక్కెట్ దక్కడంతో ఆర్కే సైలెంట్ అయిపోయారు. నియోజకవర్గంలో ఆయనకు బంధువర్గం, స్నేహితులు ఉండడంతో సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. వర్గవిభేదాలతో టీడీపీ కూడా అంత బలంగా లేకపోవడం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. మరి సీఎం జగన్ ఏం చేస్తారో వేచిచూడాలి మరి!!