7వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ ?
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ హస్తిన పర్యటనలో ఉన్న సమయంలో కేబినెట్ భేటీకి రంగం
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ హస్తిన పర్యటనలో ఉన్న సమయంలో కేబినెట్ భేటీకి రంగం సిద్ధమైంది. జూన్ 7వ తేదీన కేబినెట్ భేటీ జరగనుందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటలో ఉన్న సీఎం జగన్.. నిన్న రాత్రే ఏపీకి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మొదటి రోజు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రోజు పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఇక నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ విడివిడిగా భేటీ అయ్యారు.
అమిత్ షా, సీఎం జగన్‌ల భేటీ దాదాపు 40 నిమిషాల పాటు సాగింది. ఇరువురూ వివిధ అంశాలపై చర్చించారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత వీరి భేటీ జరగడం చర్చనీయాంశంగా మారింది. పోలవరం, కడప ఉక్కు, తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు వంటివాటిపై చర్చించారని ప్రభుత్వం చెబుతున్న.. అర్ధరాత్రి వేళ షాను జగన్ కలవడం ఏదో పెద్ద వ్యూహామే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకువెళ్లాలనే వ్యూహంతోనే జగన్.. అమిత్‌షాని కలిశారని అంటున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చిన సీఎం జగన్.. ఇప్పుడు కేబినెట్ భేటీకి సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుత సమయంలోనే ఎన్నికలకు వెళ్తే మళ్లీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ పార్టీ వర్గాలు కొన్నాళ్ల నుండి పార్టీ అధిష్ఠానికి చెబుతూ వస్తున్నాయి. అటు ప్రతిపక్షాల పొత్తుల విషయంలో కూడా ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. ప్రతిపక్షాలు విడివిడిగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ సమయంలో ఉన్న పలంగా ఎన్నికలకు వెళ్తే.. ప్రతిపక్షాలు తమ పొత్తుల విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, వారిని సిద్ధం చేసేందుకు చాలా సమయం పడుతుంది. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎలాగైనా ప్రతిపక్షాలపై మళ్లీ పైచేయి సాధించాలని సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన సీఎం జగన్.. ఇప్పుడు కేబినెట్ భేటీ పెట్టి, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రీ పోల్‌కు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.