మేనిఫెస్టోపై వైఎస్ జగన్ స్పెషల్ ఫోకస్
ఏపీలో ఎన్నికల వేడిగా క్రమంగా రాజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీలో ఎన్నికల వేడిగా క్రమంగా రాజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 99.5 శాతం నెరవేర్చినట్లు ప్రకటించిన జగన్, ఆ విశ్వాసంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మేనిఫెస్టో రూపకల్పనపైనే స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఓటర్లను ప్రభావితం చేసి, జనాన్ని తమకు అనుకూలంగా మార్చడంలో మేనిఫెస్టో కీలకంగా పనిచేస్తుంది. అధికారంలోకి రావాలని భావించే రాజకీయ పార్టీలు, తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తామో చెప్పాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టోపై వైసీపీ అధిష్ఠానం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్.. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేసేవందుకు, అలాగే ఎక్కువ మందికి లాభం చేకూరే అవకాశాన్ని వైఎస్ జగన్ పరిశీలిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయ ఢంకా మోగించడమే లక్ష్యంగా మేనిఫెస్టో రూపకల్పన జరగబోతోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. నవరత్నాల పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో వైఎస్ జగన్ విడుదల చేసిన నవరత్నాల మేనిఫెస్టో విజయవంతం అయ్యింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఈసారి ఎలాంటి మేనిఫెస్టోను ప్రకటిస్తుందనే ఆసక్తి రాష్ట్ర ప్రజలందరిలోనూ కనిపిస్తోంది.
వైఎస్ జగన్ సంక్షేమ పథకాల అమలుపై తనకు అనువైన రాజకీయ నేతలు, సీనియర్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సరికొత్త నవరత్నాలను తీసుకొచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ఏపీలో ప్రధానమైన వర్గాలపై వైసీపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రైతులతో పాటు ప్రభుత్వ సాయం పొందే పెన్షనర్లకు అదనపు ప్రయోజనాలను ప్రకటించే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ మేనిఫెస్టో కోసం ఏర్పాటైన కమిటీ వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో పనిలోకి దిగనుందని, మేనిఫెస్టోపై సూచనలు చేసి నివేదిక రూపొందిస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఈ కమిటీ అందించే సూచనలను జగన్ పరిశీలించి ఆమోదముద్ర వేయనున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంటుంది.