కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రుల కౌంటర్లు

ఏపీలో తమ ప్రభుత్వ విధానం, అభివృద్ధి చూడాలని చెప్పారు. ఏపీలో నాడు- నేడు పథకంపై తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు..

Update: 2022-04-29 10:40 GMT

హైదరాబాద్ / అమరావతి : తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు గట్టిగానే రిప్లై ఇస్తున్నారు. ఏపీలో మౌలిక వ‌స‌తులు లేవంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీకి చెందిన నేత‌లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందిస్తూ మంత్రి కేటీఆర్ లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గురించి అలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. ఏపీకి 4 కాదు 40 బస్సులు వేసుకురావాలని మంత్రి అప్పలరాజు కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కేటీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం మా ఉద్దేశం కాదని అప్పలరాజు చెప్పుకొచ్చారు.

ఏపీలో తమ ప్రభుత్వ విధానం, అభివృద్ధి చూడాలని చెప్పారు. ఏపీలో నాడు- నేడు పథకంపై తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు ప్రశంసించాయని..కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక కూడా మా ప్రభుత్వ విధానాలను అనుసరించారని మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. కేటీఆర్ లాంటి వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడకూడదని.. మా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పకుండా ఖండిస్తామని అన్నారు. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందించారు. ఏపీ గురించి కేటీఆర్ ప్ర‌త్య‌క్షంగా ఏమీ చూడ‌కుండానే ఆయ‌న స్నేహితుడు చెప్పిన మాట‌లు నిజ‌మ‌ని న‌మ్మి ఆయ‌న వ్యాఖ్య‌లు చేశార‌న్నారు బొత్స‌.
తెలంగాణ‌లో ప‌రిస్థితుల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసినా తాను ఎవ‌రికి చెప్పుకోవడం లేదు క‌దా అని అన్నారు. ఏపీ గురించి కేటీఆర్‌కు ఎవ‌రో స్నేహితుడు ఫోన్ చేశాడేమో.. నేను నిన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లోనే ఉన్నానన్నారు. క‌రెంట్ లేక జ‌న‌రేట‌ర్ మీద ఉండాల్సి వ‌చ్చిందని.. ఇది నేనెవ‌రితోనూ చెప్ప‌లేదు క‌దా అని ప్రశ్నించారు. కేటీఆర్ బాధ్య‌త క‌లిగిన స్థాయిలో ఉండి అలా మాట్లాడ‌కూడ‌దు. మీ ద‌గ్గ‌ర జ‌రిగిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోవ‌చ్చు. కానీ ప‌క్క రాష్ట్రాల‌ను విమ‌ర్శించ‌వ‌ద్దని బొత్స అన్నారు. కేటీఆర్ త‌న వ్యాఖ్య‌ల‌ను వెనక్కు తీసుకోవాలని బొత్స డిమాండ్ చేశారు.


Tags:    

Similar News