ఢిల్లీకి సీఎం జగన్.. ఎందుకంటే ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం.. ఎల్లుండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం.. ఎల్లుండి ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని విశ్వసనీయ సమాచారం. ఎన్నికలకు రెడీ అవుతోన్న వేళ.. సీఎం జగన్ ఢిల్లీ టూర్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో జగన్ ఢిల్లీ టూర్, ఢిల్లీ పెద్దలతో సమావేశాలకు ప్రాధాన్యత పెరిగింది.
కేంద్రంలోని ప్రముఖులతో సీఎం జగన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు ఆర్థికంగాను కేంద్రం నుంచి సహాయం అందుతోంది. ఇప్పటికే పెండింగ్ ఉన్న నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తోంది. ఈ సమయంలో బీజేపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని టీడీపీ, జనసేన ఊవ్విళ్లురుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీని మట్టి కరిపిస్తామని పవన్ అంటున్నారు. ఈ టైంలో జనసేనతో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ, టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రధాని మోదీ, అమిత్ షాలతో సీఎం జగన్ సమావేశం సమయంలో ఏపీ రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీని ద్వారా సీఎం జగన్ ఎన్నికలకు మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. నిన్న కొవ్వూరులో జరిగిన విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తనను ఓడించేందుకు తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో గజ దొంగల ముఠా ఏర్పడిందన్నారు. ప్రతి కుటుంబంలో మంచి జరిగిందనిపిస్తే మళ్లీ తనకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఇక ఇటీవల కాలంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. తక్కువ వ్యవధిలోనే సీఎం జగన్ వరుస ఢిల్లీ పర్యటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.