రాహుల్ గాంధీకి అస‌దుద్దిన్ ఓవైసీ స‌వాల్‌... సీరియ‌స్‌గా తీసుకున్న రేవంత్ రెడ్డి ?

రాహుల్ గాంధీ గ‌త ఎన్నిక‌ల్లో కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి గెలిచారు. ఆయ‌న వ‌యనాడ్ నుంచి ఈసారి ఓడిపోతార‌ని అస‌దుద్దిన్ చెప్పారు.

Update: 2022-05-12 05:39 GMT

ఇటీవ‌ల వ‌రంగ‌ల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన‌ రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌కు రాహుల్ గాంధీ హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ‌లో ఆయ‌న టీఆర్ఎస్‌, బీజేపీల‌తో పాటు ఎంఐఎం పార్టీపైన కూడా మండిప‌డ్డారు. ఈ మూడు పార్టీల‌నూ స‌వాల్ చేయ‌డానికే తెలంగాణ‌కు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌కు ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దిన్ ఓవైసీ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. రాహుల్ గాంధీకి ఆయ‌న స‌వాల్ విసిరారు.

రాహుల్ గాంధీ గ‌త ఎన్నిక‌ల్లో కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి గెలిచారు. ఆయ‌న వ‌యనాడ్ నుంచి ఈసారి ఓడిపోతార‌ని అస‌దుద్దిన్ చెప్పారు. అందుకే, రాహుల్ గాంధీ హైద‌రాబాద్ నుంచి కానీ, మెద‌క్ నుంచి కానీ పోటీ చేసి అదృష్టం ప‌రీక్షించుకోవాల‌ని స‌వాల్ విసిరారు. ఇప్పుడు ఈ స‌వాల్‌నే తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు, ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజంగానే, రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న పార్టీలో మొద‌లైంద‌ని స‌మాచారం.

అయితే, 2024లో పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అంత‌కంటే ముందే 2023లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు ఉంటాయి. కాబ‌ట్టి, అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలా, వ‌ద్దా అనే నిర్ణ‌యం తీసుకోనున్నారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ నుంచి పోటీ చేసినా గెల‌వ‌డం మాత్రం అంత సులువు కాదు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం అమేథీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాబ‌ట్టి, ఇప్పుడు హైద‌రాబాద్ నుంచి పోటీ చేసి రిస్క్ తీసుకోవ‌డం అనేది జ‌ర‌గ‌దు.

ఇక‌, మెద‌క్ నుంచి రాహుల్ గాంధీని పోటీ చేయించాల‌నేది మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో సీరియ‌స్ ఆలోచ‌న న‌డుస్తోంద‌ని స‌మాచారం. మెద‌క్ నుంచి పోటీ చేసిన చ‌రిత్ర గాంధీ కుటుంబానికి ఉంది. 1980 ఎన్నిక‌ల్లో ఇందిరా గాంధీ మెద‌క్ నుంచి పోటీ చేసి ప్ర‌ధాన‌మంత్రి కూడా అయ్యారు. ఆ ఎన్నిక‌ల్లో జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థి దివంగ‌త నేత ఎస్‌.జైపాల్ రెడ్డి మీద ఇందిరా గాంధీ 2 ల‌క్ష‌ల 14 వేల భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు.

అప్ప‌ట్లో ఇందిరా గాంధీ మెద‌క్ నుంచి పోటీ చేయ‌డం, గెల‌వ‌డం ఈ ప్రాంతంలో ఒక సంచ‌ల‌నం. ఇప్ప‌టికే మెద‌క్ ప్ర‌జ‌ల్లో, ముఖ్యంగా పాత త‌రం వారిలో ఇందిరా గాంధీ అంటే ఒక ప్ర‌త్యేక గుర్తింపు, అభిమానం ఉంటుంది. ఆ త‌ర్వాత కూడా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని మెద‌క్ నుంచి పోటీ చేయాల‌ని రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కులు ప‌లుమార్లు ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేదు. ఇప్పుడు మ‌రోసారి రేవంత్ రెడ్డి సారథ్యంలోని టీపీసీసీ ఈ ఆలోచ‌న‌ను సీరియ‌స్‌గా చేస్తోంది.

ఒక‌వేళ మెద‌క్ నుంచి క‌నుక రాహుల్ గాంధీ పోటీ చేస్తే క‌చ్చితంగా గెలుస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. అంతేకాదు, తెలంగాణ‌లోని మిగ‌తా సీట్ల‌పైన కూడా ఈ ప్ర‌భావం ఉంటుంద‌ని, ఎక్కువ పార్ల‌మెంటు స్థానాలు గెలిచేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. అయితే, అంత‌కంటే ముందు జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల ఫలితాల ఆధారంగానే రాహుల్ గాంధీ పోటీపైన నిర్ణ‌యం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓడితే రాహుల్ మెద‌క్ నుంచి పోటీ చేయ‌డం దాదాపుగా ఉండ‌దు. ఒక‌వేళ గెలిస్తే మాత్రం ఆయ‌న పోటీ చేసే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News