BJP : రెండు నెలలవుతున్నా దిక్కు దివానం లేకపోయినే.. ఇలగయితే ఎలా?
భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎన్నికల్లో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎనిమిది స్థానాల్లో గెలిచింది
భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎన్నికల్లో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎనిమిది స్థానాల్లో గెలిచింది. ఒకరకంగా దానికి ఊహించని విజయమే. ఎంఐఎం కంటే ఎక్కువ స్థానాలు ఆ పార్టీకి వచ్చాయి. గెలుస్తారనుకున్నోళ్లు ఓడిపోయారు. ఓడిపోతారను కున్నోళ్లు గెలిచి కూర్చున్నారు. గోషామహల్ నుంచి రాజాసింగ్ తప్పించి అందరూ దాదాపుగా కొత్త వాళ్లే. ఊహించని విధంగా దాదాపు కొత్త వారే బీజేపీ శాసనసభ్యులుగా ఎంపికయ్యారు. తెలంగాణలో ఏదో చేద్దామని బరిలోకి దిగిన కమలం పార్టీకి మరీ నిరాశ పర్చకుండా మొన్నటి ఎన్నికలు కొంత ఊరట కల్గించేలా ఫలితాలను ఇచ్చాయి.
ఊహించని స్థాయిలో...
అందులోనూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లను ఓడించిన ఘనత కూడా ఆ పార్టీ దక్కించుకుంది. కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి కేసీఆర్, రేవంత్ లను ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. అంటే ఒకరకంగా పార్టీకి ఈ గెలుపుతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాయనే చెప్పాలి. వారిద్దరినే ఓడించగలిగిన నేత ఉన్నప్పుడు మిగిలిన నియోజకవర్గాల్లో నేతలు కూడా ఆయనను రోల్ మోడల్ గా తీసుకోవాలని కూడా పార్టీ పెద్దలు సూచిస్తున్నారు.
రెండు నెలలవుతున్నా...
మరో వైపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలవుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి నిన్నటికి అరవై రోజులు కావస్తుంది. కానీ ఇప్పటి వరకూ ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ ను మాత్రం ఎన్నుకోలేక పోయింది. ఎందుకు ఇంత తాత్సారం అన్న ప్రశ్నకు అగ్రనేతల నుంచి సమాధానం లేదు. ఈరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయినా పార్టీ శాసనసభ పక్ష నేత లేకుండానే అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలు అడుగు పెట్టారంటే అంతకంటే అవమానం మరొకటి ఉంటుందా? అన్న ప్రశ్న తలెత్తుంది.
ఫ్లోర్ లీడర్ పదవి కోసం...
రాజాసింగ్ కు ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకూడదని బీజేపీలోని బలమైన ఒక వర్గం భావిస్తుంది. వివాదాస్పద నేత కావడంతో ఆయనను ఆపదవికి దూరంగా పెట్టడమే మంచిదన్న అభిప్రాయాన్ని చాలా మంది పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గెలిస్తే బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ ఆ దిశగానైనా ఒకరిని ఎంపిక చేయవచ్చు కదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పదవి కోసం మహేశ్వర్ రెడ్డితో పాటు కామారెడ్డిలో గెలిచిన వెంకటరమణారెడ్డి కూడా ఆశిస్తున్నారు. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం దీనిపై ఇంత వరకూ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఫ్లోర్ లీడర్ పదవి ఖాళీగానే ఉంది.