Magunta : కవిత అరెస్ట్‌తో మాగుంట టిక్కెట్ ఏమవుతుందో?.. బీజేపీ అభ్యంతరం చెబుతుందా?
మాగుంట రాఘవరెడ్డికి ఒంగోలు పార్లమెంటు స్థానం టిక్కెట్ ను టీడీపీ ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం చెబుతున్నట్లు తెలుస్తోంది
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీలో చేరారు. వైసీపీలో సీటు ఖరారు కాకపోవడంతో ఆయనతో పాటు కుమారుడు రాఘవరెడ్డితో కలసి ఆయన టీడీపీ కండువా కప్పేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే కవితను కోర్టులో హాజరు పర్చిన సందర్భంగా ఈడీ అధికారులు వేసిన రిమాండ్ రిపోర్టులో మాగుంట రాఘవరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది.
కవిత రిమాండ్ రిపోర్ట్‌లోనూ...
మాగుంట శ్రీనివాసరెడ్డి నుంచి ముప్ఫయి కోట్ల రూపాయలను సేకరించి కల్వకుంట్ల కవితను ముప్ఫయి కోట్లను ఢిల్లీకి చేర్చారంటూ రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఇదే కేసులో మాగుంట రాఘవరెడ్డి దాదాపు ఆరు నెలలకు పైగానే జైలులో ఉన్నారు. తర్వాత అప్రూవర్ గా మారి బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో స్పీడ్ పెంచింది. ఈ కేసులో అప్రూవర్ గా మారినా మాగుంట రాఘవరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి ప్రమేయం ఉందని తేలడంత్ో వారికి టిక్కెట్ ఇవ్వడానికి బీజేపీ అంగీకరిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పొత్తులో ఉండటంతో...
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తుతో కలసి పోటీ చేస్తున్నాయి. తమ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పార్టీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రముఖంగా వినిపించిన వారికి టిక్కెట్ ఇస్తే ఆ ప్రభావం దేశ వ్యాప్తంగా ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మలచుకునే అవకాశముంది. అందుకోసమే బీజేపీ నేతలు అభ్యంతరం చెప్పే అవకకాశముందంటున్నారు. మాగుంట రాఘవరెడ్డి ఈ కేసులో అప్రూవర్ గా మారినప్పటికీ ఆయన పై పడిన మచ్చ తొలగిపోలేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శించే వీలుంది. అవినీతిపరులను తాము దరిచేర్చబోమని చెబుతున్న కమలనాధులకు మాగుంట కుటుంబానికి సీటు ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి చివరకు మాగుంటకు టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్నది తేలనుంది.