BJP : తొలిసారి బరిలోకి దిగుతున్నారు.. ఇప్పుడు తెలుస్తుంది.. జనంలో ఇమేజ్ ఎంతుందో?

బీజేపీ నుంచి సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఇద్దరూ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నారు

Update: 2024-03-13 12:17 GMT

వాళ్లిద్దరూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీజేపీలో చేరారు. వారి రాజకీయ జీవితంలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే కొన్ని ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ ప్రత్యక్ష ఎన్నికలలో పోరాడేందుకు బరిలోకి దిగినట్లు స్పష్టమవుతుంది. వాళ్లే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్. బీజేపీ నుంచి రానున్న ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దిగడానికి సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. బీజేపీకి కేటాయించిన సీట్లలో వాళ్లిద్దరూ బరిలోకి దిగుతారని పార్టీలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.

టీడీపీకి వెన్నుదన్నుగా...
సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు నమ్మకమైన నేతలు. బ్యాక్ ఆఫీస్ లో ఉంటూ పార్టీకి అన్ని రకాలుగా సాయం అందించేవారు. ఆర్థికంగా మాత్రమే కాకుండా సామాజికవర్గం పరంగా కూడా బలమైన నేతలు. టీడీపీకి ఆర్థికంగా వెనక ఉండి సాయం అందిస్తూ వ్యాపారపరంగానే లబ్ది పొందేవారు. అంతే తప్ప చంద్రబాబును తమకు ఏనాడూ రాజకీయాల్లో స్థానంకల్పించాలని కోరలేదు. అభ్యర్థుల ఎంపికలోనూ వాళ్లిద్దరూ 2014, 2019 ఎన్నికల్లో కీలకంగానే ఉన్నారు. స్క్రీనింగ్ కమిటీలో సుజనా చౌదరి సభ్యుడిగా కూడా ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయిన తర్వాత రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీళ్లిద్దరూ బీజేపీలో చేరిపోయారు.
ఏలూరు నుంచి...
సుజనా చౌదరి కృష్ణా జల్లాకు చెందిన వారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా బలమైన నేత. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఆయన ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడటంతో తమ గెలుపు గ్యారంటీ అన్న నమ్మకంతో సుజనా చౌదరి ఉన్నారు. విజయవాడను వదులుకునేందుకు టీడీపీ సిద్ధపడకపోవడంతో మరో సేఫ్ ప్లేస్ ఏలూరు అని ఆయన భావిస్తున్నారని తెలిసింది. బీజేపీ అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే సుజనా చౌదరి రానున్న ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశముంది.
అనకాపల్లి నుంచి...
ఇక సీఎం రమేష్ కాపు సామాజికవర్గానికి చెందిన నేత. కడప జిల్లాకు చెందిన లీడర్. టీడీపీకి ఆర్థికంగా ఎన్నో సార్లు వెన్నుదన్నుగా నిలిచారు. చంద్రబాబుకు నమ్మకమైన నేతగా కొనసాగారు. అయితే ఆయన ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అనకాపల్లి నుంచి బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నట్లు తెలిపారు. అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్థిగా నాగబాబు బరిలోకి దిగాలనుకున్నప్పటికీ ఆ స్థానాన్ని బీజేపీ కోరడంతో అందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో సీఎం రమేష్ అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారనితెలిసింది. మొత్తం మీద ఇద్దరు కీలకనేతలు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.


Tags:    

Similar News