Andhra Pradesh : ఇక్కడ తమ అబ్యర్ధి గెలవకూడదని పార్టీ అగ్రనేతలు ఎందుకు కోరుకుంటున్నారో తెలుసా?
జగన్, చంద్రబాబులు ఇద్దరూ ఆ నియోజకవర్గం అంటేనే భయపడిపోతున్నారు. అక్కడ తమ అభ్యర్థి గెలవకూడదని కోరుకుంటున్నారు.
ఉరవకొండ శాసనసభ నియోజవకర్గం అంటే అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు దడ. అక్కడ తమ పార్టీ అభ్యర్థి గెలవకూడదనే మనసులో కోరుకుంటుంది. సెంటిమెంట్ అనుకుని తీసిపారేయకండి.. ఒకటి కాదు.. రెండు కాదు... దాదాపు రెండు దశాబ్దాల నుంచి అంతే. 1994 లో తప్పించి తర్వాత జరిగే ప్రతి ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన అభ్యర్థి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంతే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అంతే. అందుకే ఈ సెంటిమెంట్ ను రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. అందుకే ఇక్కడ పెద్దగా ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్నా పెద్దగా ఆలోచించరు. టిక్కెట్ కోసం అక్కడ పోటీ ఉన్నా ఎవరో ఒకరిని పెద్దగా ఇబ్బంది లేకుండా ఇస్తూ వెళుతున్నారు.
1994లో మాత్రమే .. ఆ తర్వాత...
1994లో ఇక్కడ పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత పార్టీ చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయింది. పార్టీ అధ్యక్షుడు, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. దానికి కారణం ఉరవకొండ కాకపోయినా ఆ తర్వాత జరిగిన ఎన్నికల తీరును పరిశీలిస్తే దానిని కొట్టిపారేయలేని పరిస్థితి ఏర్పడింది. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి శివరామిరెడ్డి విజయం సాధించారు. అయితే అప్పుడు రాష‌్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నాడు మొదలయిన ఈ సెంటిమెంట్ నేటికీ కొనసాగుతూనే ఉండటంతో రాజకీయ పార్టీ అగ్రనేతలు ఉరవకొండ అంటేనే భయపడిపోతున్నారు.
అప్పటి నుంచి...
ఇక 2004, 2009 ఎన్నికల్లో వరసగా ఉరవకొండలో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ విజయ సాధించారు. అయితే ఆ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో పాటు ఆయన చేసిన పలు సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ పార్టీని గెలిపించలేకపోయాయి. అయితేనే ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఉరవకొండలో గెలిచిన ఎమ్మెల్యే మాత్రం ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఉరవకొండలో మాత్రం విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అప్పుడు వైసీపీ ప్రతిపక్షానికే పరిమితమయింది. నాడు పయ్యావుల కేశవ్ కు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి వచ్చింది.
ఈ ఎన్నికల్లో...
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ విజయం సాధించినా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం ఆటోమేటిక్ గా జరిగిపోయింది. అలా ఉరవకొండ అంటేనే ఇటు జగన్... అటు చంద్రబాబు భయపడుతున్నారు. తమ పార్టీ నేతలు ఎవరైనా ఇక్కడ గెలవకూడదని మనసులో కోరుకుంటున్నట్లు కనిపిస్తుంది. వైసీపీ గత నెలన్నర రోజులుగా ఇంత హంగామా చేస్తున్నా ఉరవకొండ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఈరోజు జగన్ ఉరవకొండకు తొలిసారి వెళ్లారు. అయితే అక్కడ వైసీపీ గెలిస్తే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందని భావించి ఉంటారేమో.. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలతో అలా మాట్లాడి ఇలా వచ్చేశారు. టీడీపీలో కూడా చంద్రబాబు ఉరవకొండ అంటేనే ఉలిక్కిపడుతున్నారు. పయ్యావుల కేశవ్ గెలవకపోతే బాగుండని అనుకున్నట్లుంది. అందుకే అక్కడ చంద్రబాబు పర్యటనలే లేవు. మొత్తం ఉరవకొండ అంటేనే రాజకీయ పార్టీల అధినాయకత్వంలో అలజడి రేపుతుందనే చెప్పాలి.