బీఆర్​ఎస్​లో ఆశావహుల దూకుడు

రాబోయే సాధారణ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్నది. సంపూర్ణ మెజారిటీ లక్ష్యంగా భారత రాష్ట సమితి పావులు కదుపుతోంది.

Update: 2023-07-17 09:07 GMT

రాబోయే సాధారణ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్నది. సంపూర్ణ మెజారిటీ లక్ష్యంగా భారత రాష్ట సమితి పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వ్యూహాల అమలు పై ఫోకస్ చేస్తోంది. దాదాపు సిట్టింగ్ సీట్లు అన్ని సాధించాలానే టార్గెట్‌తో ముందుకు వెళ్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 95 నుండి 105 సీట్లు పక్కాగా వస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో అభ్యర్థులను ప్రకటించి, వారిని ఫుల్ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు.

కొందరు అభ్యర్థులను ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కరీంనగర్ లోక్ సభ నుంచి ప్రణాలిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను తప్పకుండా గెలిపించాలని కరీంనగర్ ప్రజలను మంత్రి కేటీఆర్ కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ గణనీయస్థానాల్లో విజయం సాధించినప్పటికీ.. ఈసారి రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఆశావహుల దూకుడు పెరుగుతోంది. ఆశావహులకు ప్రత్యేకంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో అసంతృప్తి ఉన్న లీడర్లను హై కమాండ్ పిలిపించుకొని పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

సిట్టింగ్ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్లు ఇస్తారని ప్రచారం గట్టిగా వినబడుతోంది. నియోజకవర్గాల్లో ఆశావాహుల దూకుడు జిల్లా మంత్రులకు టెన్షన్లు తెప్పిస్తోంది. పార్టీ మారే ఆలోచన ఉన్న నేతలను మంత్రులు కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే అసంతృప్తులు పోటా పోటీ కార్యక్రమాలతో సొంత గ్రూపులను తయారు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణల చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు. వీరిపై బీఆర్ఎస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన మార్క్‌ చూపించేందుకు బీఆర్‌ఎస్‌ తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు ఊవ్విళ్లూరుతోంది. 

Tags:    

Similar News