హుజరాబాద్‌లో గులాబీ జెండా ఎగరేస్తా: కౌశిక్ రెడ్డి

రాబోయే 2023 సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయం హీట్ ఎక్కింది.

Update: 2023-07-16 13:13 GMT

రాబోయే 2023 సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయం హీట్ ఎక్కింది. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ బీఆర్ఎస్ ఇంఛార్జిగా ఉన్నారు. గులాబీ పెద్దల అశీర్వాదం తనకే ఉందని, బీ పామ్ కూడా తనకే వస్తుందంటూ, గెలుపుపై కౌశిక్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుజరాబాద్‌లో గులాబీ జెండా ఎగరేసి బీఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌కి గిఫ్ట్ ఇస్తానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అంటున్నారు. హుజరాబాద్‌లో కౌశిక్‌రెడ్డి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి అప్పుటు టీఆర్ఎస్‌ పార్టీలో కొనసాగిన ఈటల రాజేందర్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి 2021లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ అధ్యక్ష్యుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సమక్షంలో.. ఆ పార్టీలో చేరారు. తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా కౌశిక్‌రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. అప్పటి నుంచి హుజరాబాద్‌లో అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజాక్షేత్రంలో ఎల్లపుడూ అందుబాటులో ఉంటు హుజూరాబాద్ గులాబీ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. రాబోయే సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో గులాబీ లీడర్ కౌశిక్ రెడ్డి అలెర్ట్ అవుతున్నారు.

అటు ప్రత్యర్థి ఈటల రాజేందర్‌ బీసీ సామాజిక వర్గం, బలమైన నేత కావడం గెలుపు కొంచం కష్టమవుతుంది అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇది వరకు హుజురాబాద్ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఇన్చార్జిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను తప్పించి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించి పాడి కౌశిక్ రెడ్డికి లైన్ క్లియర్ చేసారు గులాబీ బాస్. ఈ క్రమంలోనే నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ కౌశిక్ రెడ్డి మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ లీడర్ లతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ , బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్సీ కౌశిక్‌ ఫుల్ బిజీగా ఉంటున్నారు.

Tags:    

Similar News