మరోసారి తెలంగాణ సెంటిమెంట్.. బీఆర్‌ఎస్‌కు లాభం చేకూరేనా!
తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ పాలించి దాదాపు పదేళ్లు అవుతోంది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో
తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ పాలించి దాదాపు పదేళ్లు అవుతోంది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ముచ్చటగా మూడసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరికొన్ని నెలల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే 10 సంవత్సరాల పాటు అధికార పార్టీగా, బీఆర్‌ఎస్ గత దశాబ్దంలో దాని పనితీరు ఆధారంగా ఓట్లను కోరుతుందని భావిస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్ మాత్రం ‘‘తెలంగాణ సెంటిమెంట్‌ను’’ ప్రయోగించి ఓట్లు అడుగుతున్నట్లు కనిపిస్తోంది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్‌ఎస్‌కు గట్టి సవాల్ ఎదురవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే బీఆర్‌ఎస్ తన తనదైన శైలిలో మళ్లీ గెలుపు జెండా ఎగరవేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఏ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్, జి కిషన్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీని ఎదుర్కోవడానికి బీఆర్‌ఎస్ ఆంధ్రా నాయకులైన ఏపీ మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను ప్రస్తావిస్తూ "తెలంగాణ సెంటిమెంట్" ను ప్రేరేపిస్తోంది. తెలంగాణ మంత్రులు టి హరీష్ రావు, కెటి రామారావు వంటి బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రసంగించిన అన్ని సమావేశాలలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిల పేర్లను తప్పకుండా ప్రస్తావిస్తున్నారు.
రేవంత్ 'గురువు' చంద్రబాబు నాయుడు అని, కిషన్ రెడ్డి 'గురువు' కిరణ్ కుమార్ రెడ్డి అని అంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు ఈ పార్టీలను ఎన్నుకుంటే తెలంగాణకు మరోసారి నష్టం వాటిల్లుతుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి తమ 'శిష్యులు' రేవంత్, కిషన్ రెడ్డిల ద్వారా తెలంగాణను పాలిస్తారని చెబుతున్నారు. తెలంగాణా వ్యతిరేకులు అయిన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలపై తెలంగాణ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, తెలంగాణ మళ్లీ తమ చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని హరీష్, కేటీఆర్ కోరుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నాయుడు, రెడ్డిల పేర్లను ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్‌కు లాభాలు అందిస్తాయో లేదో చూడాలి.