వైఎస్ జగన్ సొంత ఇలాకాలో...
మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ ఏడు నియోజకవర్గాల్లో గెలిచింది. పది శాసనసభ నియోజకవర్గాలున్న కడప జిల్లాలో తొలిసారి కూటమి పార్టీలకు ఇంతటి పెద్ద స్థాయిలో విజయం లభించిందనే చెప్పాలి. ఎప్పుడూ ఒకటి, అరా స్థానాలను సాధించే తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. 2019 ఎన్నికలలో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ వైసీపీ ఇదే తరహా విజయాన్ని సాధించిందని చెప్పాలి. అంటే గెలుపోటముల విషయంలో ఒక ఎన్నికకు, మరొక ఎన్నికకు ఫలితాలు తారుమారు అవుతాయి. అందువల్ల మొన్నటి విజయం తమ విజయంగా భావించాల్సిన పని ఏ ఎమ్మెల్యేకు ఉండదు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత, చంద్రబాబు పట్ల సానుకూలత ఈ ఫలితాలను తెచ్చిపెట్టాయని చెప్పాలి.
రెండున్నర దశాబ్దాల తర్వాత...
అయితే కడప నియోజకవర్గంలో 1999లో గెలిచిన తర్వాత మళ్లీ టీడీపీ గెలిచింది 2024 లోనే. 1999 తర్వాత ఇక టీడీపీ అక్కడ గెలవలేదు. అంటే దాదాపు రెండున్నర దశాబ్దం కడప నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురలేదు. ఈసారి మాత్రం మాధవి రెడ్డి గెలిచి తన సత్తాను చాటారు. మాధవీ రెడ్డి భర్త కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి. తొలి నుంచి ఆయన కుటుంబం టీడీపీలోనే కొనసాగుతుంది. అలాగే ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన కుటుంబంగా పేరుంది. కానీ కొన్నేళ్ల నుంచి అక్కడ గెలవలేకపోయినా పార్టీ జెండాను వదిలి పెట్టలేదు. ఈసారి మాత్రం తన సతీమణి మాధవరెడ్డికి టిక్కెట్ తెచ్చుకుని మరీ గెలిపించుకున్నారు. నిజానికి మంత్రి పదవిని ఆశించినా దక్కలేదు.
పార్టీకి డ్యామేజీ అవుతున్నా...
కానీ మాధవీ రెడ్డి స్పీడ్ కొంత పార్టీకి ఇబ్బందిగా మారిందంటున్నారు. అనవసర విషయాల్లో తలదూర్చడంతో ఉన్న సానుభూతి పోయి పార్టీకి నష్టం తెస్తుందనే వారు కూడా లేకపోలేదు. అలాగే టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ నేతలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఆమె క్యాడర్ లోకి తప్పుడు సంకేతాలను పంపారంటున్నారు. అలాగే కార్పొరేషన్ లో కుర్చీ కోసం చేస్తున్న గలాటా కూడా కొంత కాంట్రవర్సీగా మారింది. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కూడా పార్టీకి డ్యామేజీ తెచ్చి పెడుతున్నాయని చెబుతున్నారు. అయితే ఇదంతా చేస్తుంది.. మాధవి రెడ్డి కేవలం మంత్రి పదవి కోసమే అనే వారు లేకపోలేదు. మంత్రివర్గ విస్తరణ ఉంటే ఈసారి కడప జిల్లా నుంచి ఛాన్స్ కొట్టేయడానికే ఈ రకంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారంటున్నారు సొంత పార్టీ నేతలు.