ఆ అవకాశం కోసమేనా?
తన పదవికి ఎప్పుడైనా ఎసరు రావడం అంటూ జరిగితే అందులో చంద్రబాబు కూడా ఒక కారణమవుతారని ఆయన ఖచ్చితంగా అంచనా వేస్తారు. తాను ఆ అవకాశం ఇవ్వదలచుకోలేదు. చంద్రబాబుతో నేరుగా యుద్ధానికి దిగకపోయినా ఆయన సామాజికవర్గం అధికంగా ఉన్న ఇండ్రస్ట్రీని గ్రిప్ లో ఉంచుకోవడం, వారి మాట వినకపోవడం వంటి వాటితో తనపైన ఉన్న ముద్రను చెరిపేసుకోవడం ప్రధాన లక్ష్యంగా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లే కనిపిస్తుంది. టాలీవుడ్ విషయంలో రేవంత్ రెడ్డి ఫర్మ్ గా ఉన్నారు. టాలీవుడ్ అంటే ఎక్కువగా ఒక సామాజికవర్గం డామినేషన్ అని అందరికీ తెలిసిందే. అయితే చిరంజీవి కుటుంబం, దిల్ రాజు ఫ్యామిలీ ఒకింత మినహాయింపు ఇచ్చినా ఎక్కువ మంది వారే. అలాగని చూసీ చూడనట్లు వెళితే చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నానన్న ప్రచారాన్ని ప్రత్యర్థులు చేసే అవకాశముంది.
అల్లు అర్జున్ ఎపిసోడ్ ...
అందుకే ఆ అవకాశం ప్రత్యర్థులకు ఇవ్వకూడదని రేవంత్ రెడ్డి భావించినట్లుంది. అందుకు అల్లు అర్జున్ ఎపిసోడ్ కలసి వచ్చింది. టాలీవుడ్ ను ఒక నొక్కు నొక్కితే కొంత ఈ ముద్ర నుంచి బయటపడే అవకాశముంది. టాలీవుడ్ తో ఇటీవల జరిగిన సమావేశంలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే. అంటే తన పాత పార్టీకి చెందిన వారే. వారందరూ రేవంత్ రెడ్డికి తెలియంది కాదు. నాగార్జున మినహా మురళి మోహన్, రాఘవేంద్రరావు లాంటి వారు నేరుగా టీడీపీతో సంబంధం ఉన్న వారే. అందుకే తెలివిగా రాఘవేంద్రరావును, మురళీ మోహన్ ను కూడా టాలీవుడ్ నుంచి తీసుకువచ్చారు. కనీసం వీరిద్దరి మాటలను అయినా కొంత రేవంత్ రెడ్డి వింటారని భావించి ఉంటారు.
చెప్పాలనుకున్నది చెప్పేసి...
అయితే ఈ సమావేశంలో తాను చెప్పాలనుకున్నది చెప్పేసి రేవంత్ రెడ్డి వెళ్లిపోయారు. వారు చెప్పినవి విన్నప్పటికీ టిక్కెట్ ధరలను పెంచడానికి, బెనిఫిట్ షోలను అనుమతించడానికి మాత్రం ఒప్పుకోనని తెగేసి చెప్పడంతో రేవంత్ రెడ్డి తానింతేనని సంకేతాలను ఇటు టీడీపీ అధినేతకు కూడా పంపగలిగాడు. తెలంగాణ సమాజానికి కూడా అది అర్థమయింది. అలాగే ఎక్కువ మంది తెలంగాణ కళాకారులు, నిర్మాతలు సమావేశంలో ఉండేలా కూడా జాగ్రత్తలు పడినట్లే కనిపించింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తనకు పదవి కంటే ఏదీ ముఖ్యం కాదన్న విషయాన్ని పరోక్షంగా కుండ బద్దలు కొట్టినట్లయింది. అందుకే టాలీవుడ్ పెద్దలు ఏదో ఆశించి వచ్చినా నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ సినిమాకు హబ్ గా చేయాలని, దానికి రూట్ మ్యాప్ రూపొందించాలని చెప్పి పంపి రేవంత్ రెడ్డి తనలోని అసలైన రాజకీయ నేతను వారికి చూపించారు.