ఒక్కరూ గెలవలేని పరిస్థితుల్లో...
2019 ఎన్నికల్లో కనీసం రెండు శాతం ఓట్లు కూడా రాలేదంటే ఆ పార్టీ దయనీయమైన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మోదీ ఇమేజ్ కూడా ఇక్కడ పనిచేయదని ఆ ఎన్నికల ఫలితాల్లో అర్థమవుతుంది. అయినా సరే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలసి పోటీ చేయడంతో అత్యధిక స్థానాలను గెలుచుకుంది. అయితే గెలిచిందన్న మాటే కానీ నేతల్లో సఖ్యత కొరవడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక గ్రూపులు ఇక్కడ బయలుదేరాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి మాటకు విలువ లేకుండానేతలు వ్యవహరిస్తున్నారు. పార్టీ స్టాండ్ ఏంటో ఎవరికీ అర్ధం కాదు. అధ్యక్షురాలు ఒకరకంగా, మరో నేత మరొక రకంగా మాట్లాడి ప్రజల్లోనూ, క్యాడర్ లోనూ తప్పుడు సంకేతాలను పంపుతున్నారు.
పురంద్రీశ్వరి మాత్రం...
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తీసుకుంటే రెండురాష్ట్రాల్లోని బీజేపీ నేతలు దానిని ఖండించారు. జరిగిన ఘటనలో అల్లు అర్జున్ తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ నేతల సంగతి పక్కన పెడితే ఏపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి కూడా అల్లు అర్జున్ వైపు నిలిచారు. సంథ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమని అంటూనే అందులో అల్లు అర్జున్ తప్పేముందని ప్రశ్నించారు. అంతేకాదు ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ ను ఎందుకు అరెస్ట్ చేయాలో చెప్పాలంటూ పురంద్రీశ్వరి డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ కారణాలతోనే అల్లు అర్జున్ పై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, దీనిని అందరూ వ్యతిరేకించాలని కూడా చిన్నమ్మ పిలుపు నిచ్చారు.
కానీ విష్ణుకుమార్ రాజు మాత్రం...
కానీ అదే సమయంలో శాసనసభలో బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు వాయిస్ మాత్రం భిన్నంగా వినిపించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తెలంగాణ ప్రభుత్వ చర్యను సమర్ధిస్తున్నాని బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అన్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది పూర్తిగా నిజమే అయితే అల్లుఅర్జున్ పై చర్యలు కరెక్టేనని విష్ణుకుమార్ రాజు అన్నారు. అంతేకాదు ఆయన రేవంత్ రెడ్డికి మెసేజ్ కూడా పెట్టారు. బాగా చేశారంటూ మెసేజ్ పెట్టానని విష్ణుకుమార్ రాజే చెప్పారు. మరోవైపు ఏపీలో బెనిఫిట్ షోలు కూడా రద్దు చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేయడం ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పడేసింది. సినిమా రంగంపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే విష్ణుకుమార్ రాజు తన అభిప్రాయాన్ని చెప్పడం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేశారంటున్నారు. మంత్రి పదవి రాలేదన్న కారణంతోనే ఆయన అసంతృప్తితో ఉండి ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీలో విష్ణుకుమార్ రాజు ఇబ్బందికరంగా మారారంటున్నారు.