ప్రీ - పోల్‌ అలయన్స్‌కు ఆసక్తి చూపని బీఆర్‌ఎస్‌.!

డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ఎన్నికల పొత్తు (ప్రీ-పోల్‌ అలయన్స్‌)పై అధికార బీఆర్‌ఎస్ ఆసక్తి చూపడం

Update: 2023-05-22 05:41 GMT

హైదరాబాద్ : డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ఎన్నికల పొత్తు (ప్రీ-పోల్‌ అలయన్స్‌)పై అధికార బీఆర్‌ఎస్ ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పార్టీ మొత్తం 104 మంది ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులు.. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. అవసరమైతే ఎన్నికల అనంతర పొత్తులను పార్టీ పరిశీలిస్తుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 2014, 2018లో బీఆర్‌ఎస్‌ పార్టీ పొత్తు లేకుండా అన్ని స్థానాల్లో పోటీ చేసి రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారికూడా పార్టీ 'హ్యాట్రిక్' లక్ష్యంగా పెట్టుకుంది. సొంతంగా ఈ ఫీట్ సాధించాలనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలోని ఇతర పార్టీలన్నీ తమ రాజకీయ ఎత్తుగడలతో బలంగా ఉన్నందున పొత్తుల కోసం వామపక్షాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం బీఆర్‌ఎస్‌కి మాత్రమే ఉంది. నవంబర్ 2022లో జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో.. బీజేపీని ఓడించడానికి బీఆర్‌ఎస్‌ వామపక్షాలతో ముందస్తు ఎన్నికల కూటమిని ఏర్పాటు చేసి విజయం సాధించింది. అయితే ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో కూటమిని మళ్లీ ఏర్పాటు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. కాగా వామపక్షాలతో బీఆర్‌ఎస్‌ ఎన్నికల కూటమి కేవలం మునుగోడుకు మాత్రమే పరిమితం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పట్లో ప్రకటించారు.

మునుగోడు ఎన్నికలు జరిగి ఏడు నెలలు గడుస్తున్నా వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి ముఖ్యమంత్రి వైపు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంలో, సహకరించడంలో విఫలమైనందుకు వామపక్ష పార్టీల నాయకులు అధికార పార్టీతో కలత చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు సీపీఐ, సీపీఎం ఇప్పటికే ఒక అంగీకారం కుదుర్చుకుని ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోని మరికొన్ని నియోజకవర్గాల్లో తమ రాజకీయ ఉన్నచోట్ల కార్యకలాపాలను వేగవంతం చేశాయి.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా వామపక్ష నేతలు తమను పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మాట్లాడుతూ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత, ఎన్నికల పొత్తుల కోసం తమకు 'కొత్త ఎంపికలు' వచ్చాయని చెప్పారు. అయితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు కొన్ని సీట్లు గెలుచుకుని, హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీఆర్‌ఎస్‌ నాయకత్వం వామపక్ష పార్టీలతో ఎన్నికల అనంతర పొత్తుకు సిద్ధంగా ఉంటుంది.

Tags:    

Similar News