ఎన్డీఏ, విపక్షాల సమావేశాలకు బీఆర్‌ఎస్‌, వైసీపీ దూరం.. కారణం ఇదేనా?

దేశంలో ఎన్నికల వేడి రాజుకుంది. సార్వత్రిక ఎన్నికలకు మరి కొన్ని నెలలే సమయం ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం

Update: 2023-07-18 07:59 GMT

దేశంలో ఎన్నికల వేడి రాజుకుంది. సార్వత్రిక ఎన్నికలకు మరి కొన్ని నెలలే సమయం ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్‌ను వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. బెంగళూరులో ఓ హోటల్‌లో విపక్ష పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాల ఐక్యతా సమావేశానికి ధీటుగా బీజేపీ వ్యూహాలు రచించింది. న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం నిర్వహించబోతోంది. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం వహించనున్నారు. అయితే ఎన్డీఏ సమావేశానికి కానీ, విపక్షాల సమావేశానికి కానీ తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలైన - తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్‌లోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానాలు లేకపోవడం ఆసక్తికరంగా మారింది.

2024 లోక్‌సభ ఎన్నికల కోసం రెండు శిబిరాలు తమ వ్యూహాలకు పదును పెట్టడం ప్రారంభించగా.. బీజెపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఎ)కి, ప్రతిపక్ష పార్టీల సమావేశానికి బీఆర్‌ఎస్‌, వైసీపీలు హాజరుకావడం లేదు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌.. బీజేపీకి వ్యతిరేకం అయినప్పటికీ సోమవారం బెంగళూరులో ప్రారంభమైన రెండు రోజుల ప్రతిపక్ష పార్టీల సమావేశానికి ఆహ్వానం లేకపోవడంతో వెళ్లలేదు. అదేవిధంగా మంగళవారం ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశానికి బీజెపీతో అప్ అండ్ డౌన్ సంబంధాన్ని పంచుకునే వైసీపీనీ ఆహ్వానించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే ఆ సమావేశానికి బీజేపీ కూటమి భాగస్వామి జనసేనకు చెందిన పవన్ కల్యాణ్‌ను మాత్రమే ఆహ్వానించారు.

బీఆర్‌ఎస్‌

అయితే "మమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదో ప్రతిపక్ష నేతలు సమాధానం చెప్పాలి" అని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే శక్తివంతమైన పార్టీ ఎవరో ప్రతిపక్ష పార్టీలకు కచ్చితంగా తెలుస్తుందని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఇటీవల రాహుల్‌ గాంధీ బీజేపీకి బిఆర్‌ఎస్.. బీ టీమ్‌ అని ఆరోపించారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు బీజేపీతో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు అన్న విషయం స్పష్టంగా తెలుస్తుందని బీఆర్‌ఎస్‌ అంటోంది. కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రాథమిక రాజకీయ ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్‌, జాతీయ స్థాయిలో అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి కోసం ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే ఈ విషయంలో కేసీఆర్‌ విఫలమైనట్టు కనిపిస్తోంది.

వైసీపీ

పార్లమెంట్‌లో బీజేపీకి మద్ధతు పలికే ఏపీలోని అధికార పార్టీ వైసీపీకి ఎన్డీఏ సమావేశం నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు. 30 పార్టీలతో కూడిన ఎన్డీయే ఢిల్లీలో, 24 విపక్షాలు బెంగళూరులో సమావేశమవుతుండగా.. ఈ రెండు సమావేశాలకు వైసీపీకి ఆహ్వానం రాలేదు. అయితే దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పడం లో వైసీపీ పాత్ర తప్పనిసరిగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ కూటమికైనా వైసీపీ అవసరం ఉంటుందని ఇటీవలి సర్వే రిపోర్టులు చెబుతున్నాయంటున్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమికైనా, విపక్షాల కూటమికైనా ఆహ్వానిస్తే వెళ్లడానికి తలుపులు తెరిచే ఉంచాలని వైసీపీ కోరుకుంటోంది. వైసీపీ విషయానికొస్తే, జగన్ మోదీకి నమ్మకమైన మిత్రుడు అన్న విషయం తెలిసిందే. కానీ ఎన్నికలలో తనకు చాలా కీలకమైన కొన్ని వర్గాల ఓట్లను కోల్పోతాననే భయంతో అతను బీజేపీతో బహిరంగంగా జతకట్టడానికి ఇష్టపడట్లేదు. 2024లో కేంద్రంలో ఏ ప్రభుత్వమైనా వైఎస్సార్‌సీపీ మద్దతుతోనే సాధ్యమవుతుందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు, జగన్‌ సన్నిహితుడు వీ విజయసాయిరెడ్డి అన్నారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డితో స్నేహంగా ఉంటూనే కొంత కాలంగా టీడీపీని అంతమొందించి ఆ స్థానంలో ఎదగాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News